మళ్లీ టీడీపీకీ కొత్తపల్లి

ఏలూరు, అక్టోబరు 16
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో చేరే స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌ కు గురయ్యారు. అప్పటినుంచి టిడిపిలో చేరాలా? లేకుంటే జనసేనలోన? అన్న డిఫెన్స్‌ లో ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బారాయుడు సుదీర్ఘకాలం టిడిపిలోనే పనిచేశారు. అనివార్య కారణాలవల్ల పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తరచూ లోకేష్‌ తో కనిపిస్తుండడంతో ఆయన తప్పకుండా టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది.ఢల్లీి నుంచి రాజమండ్రి వెళ్తున్న క్రమంలో గన్నవరం ఎయిర్పోర్ట్‌ లో లోకేష్‌ తో సుబ్బారాయుడు కనిపించారు. చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్‌ లేకుంటే.. ఈపాటికే సుబ్బారాయుడు టిడిపిలో చేరి ఉండేవారని టాక్‌ నడుస్తోంది. 1989లో తొలిసారిగా నరసాపురం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన సుబ్బరాయుడు విజయం సాధించారు. అక్కడ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు.2009లో సుబ్బారాయుడు టిడిపికి దూరమయ్యారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పిఆర్పి కాంగ్రెస్లో విలీనం కావడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల నాటికి వైసీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి జంప్‌ అయ్యారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి చేపట్టారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజుతో వచ్చిన విభేదాలతో వైసీపీ నుంచి సస్పెన్షన్‌ కు గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. తొలుత జనసేన లో చేరాలని భావించారు. ఇప్పుడు మాత్రం టిడిపిలోకి వెళ్లాలని డిసైడ్‌ అయ్యారు.చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన తరచూ లోకేష్‌ తో కనిపిస్తున్నారు. ఢల్లీిలో సైతం ఆయన వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చూస్తే నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్‌ నేత రఘురామకృష్ణంరాజుతోను తరచూ చర్చలు జరుపుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నరసాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, పొత్తూరు రామరాజు టికెట్‌ రేసులో ఉన్నారు. మరి సుబ్బరాయుడు టిడిపిలో చేరితే ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *