మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం

మే డే!.. కార్మిక దినోత్సవం? ప్రతి ఏడాది మే 1 వ తేదీ నాడు జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్హిస్తాయి.కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. తమ హక్కుల కోసం రక్తార్పణం చేసి కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికి కొత్త వెలుగులు అందించిన చరిత్ర మే డే కు ఉంది. అందుకే నాడు కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడారు. ప్రాణాలు సైతం త్యాగం చేసి కార్మిక ప్రపంచానికి చీకటిని చెరిపేసి వెలుగునందించారు. వారి పోరాటం నేటి సమాజానికి సైతం స్ఫూర్తిమంతం…
19వ శాతాబ్దంలో పెట్టుబడిదారులు కార్మికులను చేస్తున్న దోపిడీని గ్రహించి మార్క్సిస్టు మూల పురుషుడు కార్ల్‌ మార్క్స్‌ ప్రపంచ కార్మికులారా ఏకం కండి… పోరాడితే పోయేదేవిూ లేదు బానిస సంకెళ్లు తప్ప… అని ఇచ్చిన నినాదానికి కార్మికుల నుంచి ఉవ్వెత్తున స్పందిన వచ్చింది. ఇంగ్లాండ్‌ యురోపియన్‌ దేశాల్లో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న సమయంలో అటు కార్మిక రంగం అంతేవేగంగా విస్తరించింది. ఈ పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులను యాజమాన్యాలు, బానిసల్లా పనిచేయించుకునే వారు. కార్మికులకు కనీస సౌకర్యాలు, తగిన వేతనం, కల్పించకపోగా రోజుకు 18` 20 గంటలు పనిచేయించే వారు. దీంతో కార్మికులు మొదటిసారిగా 1806లో తిరుగుబాటుకు చేశారు. బ్రిటన్‌లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు ఆమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు యూరప్‌, ప్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలకు పాకింది. 8 గంటలు పనిదినం, 8 గంట నిద్ర, 8 విశ్రాంతి కావాలంటూ అటు యూరప్‌ లోను, ఇటు అమెరికాలోని కార్మికులు ఉద్యమించారు. ఈ తిరుగుబాటు మొత్తానికి అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్స్‌ యూనియన్‌ నాయకత్వం వహించింది.
చికాగో నగరంలో 1886మే 1న హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికుల హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శన జరిపారు. ఈ ర్యాలీని చెదరగోట్టేందుకు అమెరికా ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో రెచ్చిపొయిన పోలీసులు ప్రదర్శనపై కాల్పులు జరిపారు. నలుగురు కార్మికులు తుపాకీ తుటాలకు బలయ్యారు. కాల్పులకు వ్యతిరేకంగా మే 4న మరో నిరసన సభ ఏర్పాటు చేశారు. ఈ సభనూ చెదరగోట్టే ప్రయత్నంలో పోలీసులు మరోసారి ప్రతాపాన్ని చూపారు. స్వైర విహరం చేశారు. దీంతో చికాగో లోని హే మార్కేట్‌ రక్తంతో పూర్తిగా తడిసి ముద్దైంది. అక్కడే ఆవిర్భవించింది ఈ అరుణపతాకం. ఆ విధంగా మే 1 ప్రపంచ కార్మిక వర్గ విప్లవపోరాట ఉద్యమ చరిత్రలు రక్తాక్షారాలతో లిఖించదగింది. ఆనాటి పోరాటాలు ఒక్క చికాగో నగరమేగాక ప్రపంచం నలుమూలల వ్యాపించాయి. ఆ రకంగా మొదలైన మే డే నాటి నుంచి మన దేశంలో వామపక్షాల ఆధ్వర్యంలోని కార్మికులు, ఉత్సవాలను జరుపుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక రూపాల్లో కార్మికులు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. చభారతదేశంలో…భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. అయితే అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి మన దేశంలో ‘మే డే’ను పాటించారు. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.ముఖ్యంగా ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. మార్కెట్‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని వాళ్ళచే 10, 12 గంటలు పనిచేయిస్తున్నారు. 1886లో ఆరంభమైన ఈ ఉద్యమం నేటికీ కార్మిక కర్తవ్యాల్ని తెలియజేస్తోంది. మార్కెట్‌ శక్తుల శ్రమ దోపిడీపై నిలదీయాల్సిన సమన్నం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరియాలి. ఈరోజు మే డే మనందరిలో కొత్త స్ఫూర్తిని రగిలించాలి. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాలి. ఈ మేడే మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *