ఎక్కడపడితే అక్కడ మద్యం

అదిలాబాద్‌, అక్టోబరు 13
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా మారుమూల గ్రామాల నుంచి మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల వరకు మెరుపు దాడులు చేపట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజు నుండి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది మొదలు రాత్రి పగలు అన్న తేడాలేకుండా అక్రమార్కుల బెండ్‌ తీస్తున్నారు. మహారాష్ట్ర నుండి అక్రమంగా తెలంగాణలోకి తరలిస్తున్న మద్యంతో పాటు బెల్ట్‌ షాపులు పెట్టి మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న నిర్వహకుల బెండ్‌ తీస్తున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవదిలోనే వేల లీటర్ల అక్రమ మద్యం పట్టుబడగా.. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాల పరిధిలో ఏకంగా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లు బెల్ట్‌ షాపుల దందా ఏ రేంజ్‌లో సాగిందో దీనిని బట్టి తెలుస్తోంది.ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజక వర్గం ఇచ్చోడ మండల కేంద్రంలో అయితే ఓ వ్యక్తి ఇంట్లోనే వైన్‌ షాపును రన్‌ చేస్తున్నట్టు ఎన్నికల ప్రత్యేక అధికారులు గుర్తించారు. ఇచ్చోడకు చెందిన నరార్‌ రాజేశ్వర్‌ అనే బెల్ట్‌ షాప్‌ వ్యాపారి వద్ద 1.5 లక్షల విలువ చేసే మద్యాన్ని పట్టుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు సదరు మద్యాన్ని ఆప్కారీ శాఖకు ఎన్నికల అదికారుల సమక్షంలో అందజేశారు. ఇదే ఇచ్చోడ ప్రాంతంలో గురువారం ఉదయం నుండి జరిగిన తనిఖీల్లో బెల్ట్‌ షాపుల్లో ఎనిమిది లక్షల విలువ చేసే మద్యం పట్టుబడినట్టు తెలుస్తోంది.అటు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లీ గ్రామంలో ఓ బెల్ట్‌ షాప్‌ లో లక్ష రూపాయల విలువ చేసే 193 లీటర్లు మద్యం పట్టుబడగా.. ఖానాపూర్‌ మండలంలోని మస్కాపూర్‌ అఓఖీ గార్డెన్‌ సవిూపంలోని ఓ కిరణా షాపులో నడుస్తున్న బెల్ట్‌ షాప్‌ లో 21 లీటర్ల మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు. బైంసా, లక్షేట్టిపేట, జన్నారం, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌, ఆసిపాబాద్‌లో ఒక్క రోజులోనే 35 పైగా బెల్ట్‌ షాపుల నిర్వహకులపై కేసులు నమోదవగా.. 30 లక్షల పైనే మద్యం సీజ్‌ అయినట్టు సమాచారం. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉండటంతో ఈ 50 రోజుల్లో ఇంకెంత మద్యం పట్టుబడుతుందో చూడాలి.కొందరు ముందస్తుగా మద్యాన్ని శివారు ప్రాంతాలకు తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచినట్టు సమాచారం. ప్రాణహిత, గోదావరి, పెనుగంగా తీర ప్రాంతాలపై ప్రత్యేక పోకస్‌ పెట్టిన పోలీసులు ఎక్కడికక్కడ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేస్తూ బెల్ట్‌ నిర్వహకుల బెండ్‌ తీస్తుండటంతో కల్తీ మద్యానికిఎన్నికల నాటికి కట్టడి పడే అవకాశం ఉందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *