పరిష్కారమయ్యేనా?

కృష్ణా నదీ జలాల పంపిణీపై ఓ ముందడుగు పడినా, ఈ వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారమైతే జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా ట్రైబ్యునల్‌-2) మూడేళ్లలోపు నీటి పంపిణీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లలోపు తేల్చకపోతే.. ట్రైబ్యునల్‌ విజ్ఞప్తిపై కేంద్రం మరో రెండేళ్లు అవకాశం ఇస్తుంది. అయితే వివాదం ఇప్పట్లో తేలుతుందా అనేది అనుమానమే. బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ వేసి 19 ఏళ్లు గడుస్తున్నా తీర్పు అమల్లోకి రాలేదు. దాంతో అంత తేలిగ్గా ఈ వివాదం పరిష్కారమయ్యే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కేంద్రం నిర్ణయంపై ఏపీ, తెలంగాణ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కడానికి సెక్షన్‌-3తో అవకాశం దొరికిందని తెలంగాణ నీటి పారుదలశాఖ పేర్కొంది. ఏడాది, రెండేళ్లలోపు నీటి పంపిణీ చేపట్టాలని సూచించింది. ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి స్పందిస్తూ.. సెక్షన్‌-3 కింద కాకుండా సెక్షన్‌-5(1) కిందనే కృష్ణా జలాలను పంచే బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధివిధానాలలో ఏయే అంశాలు ఉన్నాయనే దానిపై అధ్యయనం చేశాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నీటి పారుదల రంగ నిపుణుడు నల్లవెల్లి రంగారెడ్డి మాట్లాడుతూ, ‘సెక్షన్‌-3 ప్రకారం మాత్రమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ బాధ్యతలు జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌కు అప్పగించాలి. నీటి పంపిణీ ప్రక్రియను నిర్ణీత వ్యవధిలోగా తేల్చేలా నిబంధనలు రూపొందించాలి’ అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *