ములుగు కోసం మాస్టర్‌ ప్లాన్‌

ములుగు నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందా.? వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకోవడానికి ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భావిస్తున్నారా..? ఏజెన్సీ నియోజకవర్గంలో బలమైన నాయకురాలిగా ఉన్న కాంగ్రెస్‌ జాతీయ నాయకురాలు, ఎమ్మెల్యే సీతక్కను ఎదుర్కొవడానికి అంతే బలమైన నాయకత్వ పటిమ కలిగిన, కోయ సామాజికవర్గం నేత కోసం సైలెంట్‌గా ఆరా తీస్తోందా..? అంటే టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. పూర్తి ఏజెన్సీ నియోజకవర్గంగా ఉన్న ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు తిరుగులేని అభిమానం ఉందన్నది వాస్తవం. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే రాజకీయంగా ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులు కూడా పార్టీ విజయానికి ఖచ్చితంగా దోహదం చేస్తాయన్న నమ్మకాన్ని వెలువరుస్తున్నారు. ఇందుకు మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోడమే నిదర్శనమని గుర్తుచేస్తున్నారు.అయితే జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్‌ ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అందుకు ఆమె సిద్ధంగా లేరన్న విషయం ఆమె సన్నిహితుల ద్వారా తేలిపోయినట్లు సమాచారం. మహబూబాబాద్‌, డోర్నకల్‌ రెండు నియోజకవర్గాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి ఆమె టికెట్‌ ఆశిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ములుగు జిల్లా వాస్తవ్యుడైన మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు కూడా అవకాశం ఉన్నా కనీస ప్రయత్నం చేయడం లేదన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఇద్దరి నేతలు మౌనం దాల్చుతుండటంతోనే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.ములుగు నియోజకవర్గంపై ఇప్పటికే పీకే టీం సమర్పించిన సర్వేలో పార్టీకి ఎదురీతేనని తేలినట్లు సమాచారం. అయితే పార్టీ శ్రేణులు, గ్రామస్థాయిలో క్యాడర్‌ చాలా బలంగా ఉందని నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ములుగు నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు నియోజకవర్గం నేతల్లో పార్టీ టికెట్‌పై ఆసక్తి, ఆశలు పెట్టుకున్నవారి పేర్లను కేటీఆర్‌ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆశవహుల్లో ప్రముఖంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తాడ్వాయి జడ్పీటీసీ బడె నాగజ్యోతి, ములుగు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి అల్లం అప్పయ్యతోపాటు మునిసిపల్‌ శాఖలో ఉద్యోగిగా ఉన్న భూక్య దేవ్‌సింగ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హంములుగు నియోజకవర్గంలో ఆదివాసీ ఓటర్లే అధికంగా ఉండటంతో ఆ సామాజిక వర్గం నేతలకే టికెట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.1998 నుంచి అల్లం అప్పయ్య వైద్య అధికారిగా ఉంటున్నారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ ఏరియాల్లో ఆయన పనిచేయగా ఎక్కువ కాలం మాత్రం ములుగు ప్రాంతంలోనే పనిచేశారు. ఆయన వాస్తవ్యం కూడా ములుగు మండలం అక్కంపేట కావడం గమనార్హం. కోయ సామాజిక వర్గానికి చెందిన అల్లం అప్పయ్య కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్కకు దూరపు బంధువు కూడా. జిల్లాలో సుదీర్ఘకాలం పాటు వైద్యాధికారిగా పనిచేయడంతో ఆయనకు నేరుగా చాలా మంది ప్రజలతో సత్సబంధాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అవకాశం వస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాలని పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం పెద్దలను కూడా కలిసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక బడే నాగజ్యోతి తాడ్వాయి జడ్పీటీసీగా ఉన్నారు. ఆమె గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలు కావడంతో పార్టీ విధానాలపై మాట్లాడుతూ జనాకర్షణ కలిగిన నేతగా ఎదిగారు. ఆదివాసీ మహిళగా సీతక్క సరైన పోటీ ఇవ్వగలిగిన నేతగా ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు.2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీమంత్రి చందులాల్‌ సీతక్క చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్ది నెలలకు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. నాటి నుంచి నేటి వరకు ములుగు నియోజకవర్గం బాధ్యతలను టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరికి అప్పగించలేదు. ములుగు నియోజకవర్గంలో కారు జోరుకు అధిష్ఠానమే అసబద్ధమైన నిర్ణయాలతో ఆగిపోయేలా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌కే జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను కూడా అప్పగించడాన్ని కొంతమంది గిరిజన నేతలు తప్పుబడుతున్నారు. పార్టీ ఏ కోణంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలియదు గానీ కోయ, గిరిజన సామాజిక వర్గం నేతల్లో ఒకరికి ఈ పదవి అప్పగిస్తే పార్టీకి రాజకీయంగా లాభదాయకంగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గం నేత జగదీశ్‌కు ఇవ్వడం ద్వారా పార్టీకి పెద్దగా లాభదాయకం చేయలేకపోయిందని నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *