‘మీ కోసం ఎదురుచూస్తున్నాను’.. భారత క్రీడాకారులపై మోదీ ప్రశంసలు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు 100 పతకాలు అందించిన క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత క్రీడాకారులను అభినందించిన మోదీ.. వారి ప్రదర్శన విస్మయం కలిగించిందని అన్నారు. 10వ తేదీన భారత్‌కు 100 పతకాలు అందించిన క్రీడాకారులను కలవడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘‘ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది అద్భుత విజయం. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విస్మయం కలిగించే వారి ప్రదర్శన చరిత్ర సృష్టించింది. మన హృదయాలను గర్వంతో నింపింది. నేను 10వ తేదీన మన ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారితో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాను.’’ అని తెలిపారు.
కాగా చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి 100 పతకాలను గెలిచింది. మహిళల కబడ్డీలో భారత జట్టు స్వర్ణం గెలుచుకోవడం ద్వారా ఈ మార్కు అందుకుంది. ఫైనల్‌ పోరులో భారత మహిళల జట్టు చైనీస్ జట్టును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 26-25తో గెలిచింది. మొదటి 20 నిమిషాల్లో భారత్ జట్టు 14-9తో అధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో చైనా ప్లేయర్లు రాణించడంతో 39 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 24-24తో సమంగా నిలిచాయి. చివరి నిమిషంలో ఒత్తిడిని అధిగమిస్తూ మన అమ్మాయిలు అదరగొట్టడంతో 26-25తో భారత్‌ అధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో గెలుపు మన సొంతమైంది. కాగా ఈ సారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు గెలడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. దీంతో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *