తెలంగాణలో మరో కొత్త పార్టీ..?

తెలంగాణలో కొత్త పార్టీ అంశంపై జోరుగాప్రచారం జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంటే అస్త్రంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్‌ ను ఉపయోగించుకునేందుకు కొత్తగా టీఆర్‌ఎస్‌ పార్టీని కొంత మంది కీలక నేతలు మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అనే పేరు ఉంటుంది కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి అనే పేరు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఈ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెబుతున్నారు.తెలంగాణలో ఏర్పాటయ్యే కొత్త పార్టీ వ్యూహంలో పాలు పంచుకుంటున్నదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 20 మంది కీలక నేతలు కొత్త పార్టీ ఏర్పాటులో పాలు పంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీళ్లంతా పొంగులేటి, జూపల్లితో రహస్యంతా మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. ప్రజాబలం ఉండి.. మూడు పార్టీల్లో ఇమడలేక పోతున్నవారు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి అసంతృప్తులు, బీఆర్‌ఎస్‌ లో మొదటి నుంచి కొనసాగుతూ పదవులు దక్కని వారు కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు తెలంగాణ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పొంగులేటి, జూపల్లి కృష్ణారావును తాను బీజేపీలో చేరాలని ఆహ్వానించానని, వారు తనకే కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని ఈటల రాజేందర్‌ విూడియా చిట్‌ చాట్‌ లో చెప్పారు. ఆ నేతకు వాళ్లేం కౌన్సెలింగ్‌ ఇచ్చారు..? ఏం మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కొనసాగింపుగా జూపల్లి కృష్ణారావు బీజేపీకి చెందిన నలుగురైదుగురు నేతలు తనతో టచ్‌ లో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఇప్పటి వరకు పదవులు దక్కని నేతలు, టికెట్లు రావనుకొనే వారు కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో వర్గపోరు ఉంది. పలువురు ఎమ్మెల్యేలు తాజాగా తమ పరిస్థితి ఏమిటని సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఇలాంటి నేతలంతా కొత్తగా ఏర్పడబోయే పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు పది మంది వరకు పొంగులేటి, జూపల్లితో టచ్‌ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తెర వెనుక ఆర్థికంగా బలమైన నేతలే ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే తెర వెనుక పార్టీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చుకున్న అంశాన్ని ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ రేపి.. మంచి విజయం సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడిరచాలన్న లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని… టీఆర్‌ఎస్‌ పేరుతో మరో పార్టీ ఉంటే అది? బీఆర్‌ఎస్‌కే నేష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త పార్టీలో కీలకమయ్యే నేతల్లో అత్యధిక మంది లక్ష్యం కూడా టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడిరచడమే. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మరో నేత కూడా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన పై కుట్రలు చేస్తున్నారని.. దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉద్యమ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండటం ఆయనకు ప్లస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఈ రాజకీయ పార్టీ అంశం ఉద్దృతంగా తెరపైకి వచ్చి.. తెలంగాణ అంశానికి దూరంగా జరగడం ఇష్టం లేని నేతలు ఈ పార్టీలో చేరితే.. బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీని ఎప్పుడు తెరపైకి తెస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *