అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని సీఎం జగన్‌కు ఆ ప్రాంత భూములు విక్రయించే హక్కు ఎక్కడిదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చే యత్నాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైకాపా విధానాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

‘‘ఆత్మకూరు ఉపఎన్నికలో డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా వైకాపాకు ఓట్లు పెరగలేదు. దీనికి ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణం. గత ఎన్నికలతో ఉప ఎన్నికను పోల్చి చూస్తే వైకాపాకు కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదు. పన్నులతో వాతలు.. పథకాలకు కోతలు.. అనేలా జగన్ పాలన సాగుతోంది. ప్రజలకు అందే పథకాల్లో రకరకాల నిబంధనల పేరుతో కోతలు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారు. చెత్త దగ్గర నుంచి మొదలు అన్నింటిపైనా పన్నులు వేసి వాతలు పెడుతున్నారు. పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కొత్త కొత్త నిబంధనలతో కోతలు వేస్తోంది. ఒంటరి మహిళల పింఛన్‌ వయసు నింబంధనను 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయం’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *