ధరణి కష్టాలకు ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు

భూమి హక్కులను సరిదిద్దే ప్రక్రియకు సరైన మార్గమేది? అధికారం ఎవరికి ఉండాలి? ఇప్పుడు ధరణి పోర్టల్‌ అనుసరిస్తున్న విధానం సరైనదేనా? ఈ సాంకేతికత అనుసరణీయమేనా? అన్న డౌట్‌ వస్తున్నది. ఆ ప్రోగ్రామింగ్‌, కోడిరగ్‌.. ఎవరు చేశారో, ఎందుకు చేశారో, దాని ఉద్దేశమేమిటో అంతుచిక్కడం లేదు. ఒక్కో ఆప్షన్‌ ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. కొన్ని నెలల క్రితం ఇచ్చిన టీఎం33 ఆప్షన్‌లో గమ్మత్తులు చోటు చేసుకుంటున్నాయి. అత్యంత విలువైన, లక్షలాది సమస్యలను పరిష్కరించే ఉద్ధేశంతో ఇచ్చిన ఆ ఆప్షన్‌లో దరఖాస్తులే మాయమవుతున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకుంటే అలా డాక్యుమెంట్లు వెరిఫై చేసి ఆమోదించే ప్రక్రియ ఇది. దీంట్లో కొత్తగా ‘నోటీస్‌ జనరేటెడ్‌’ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఎవరికి నోటీసులు జారీ చేస్తున్నారు? ఎవరి నుంచి వివరణ తీసుకుంటున్నారు? అవి ఎవరికి అందాయి? అసలు ఈ నోటీసుల ప్రస్తావన ఎందుకొచ్చింది? వీటికి సీఎంవో, బీఆర్‌కే భవన్‌లోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే సమాధానం చెప్పాలి. టీఎం33 ఆప్షన్‌ కింద .. పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, భూమి రకం మార్పు, విస్తీర్ణం సవరణ, మిస్సింగ్‌ సర్వే/సబ్‌ డివిజన్‌ నం., నోషనల్‌ ఖాతా(అన్ని రకాలు) నుంచి పట్టా భూమిగా బదిలీ చేయడం, భూమి వినియోగాన్ని నాలా నుంచి వ్యవసాయానికి మార్చడం వంటి సమస్యలను పరిష్కరిస్తారు. ఈ అంశాల్లో ఎవరికైనా నోటీసులు సర్వ్‌ చేయాల్సిన పని ఉన్నదా? అన్ని పాత, కొత్త రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఆమోదించేవే. కానీ ఏప్రిల్‌ 30న దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా అప్‌డేట్‌ కానివి ఉన్నాయి. ఒక్క రోజులో చేయగలిగే సమస్యలను కూడా నెలల తరబడి పెండిరగులోనే ఉంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎం33 ఆప్షన్‌ కిందనే లక్ష దాకా దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో చాలా మటుకు నోటీస్‌ జనరేటెడ్‌ పేరిట నిలిచిపోయాయి.చిన్న చిన్న తప్పులను సరిదిద్దాలంటూ పెట్టుకున్న అప్లికేషన్లను, రికార్డులను పరిశీలించేందుకు కొందరు కలెక్టర్లకు తీరిక దొరకడం లేదు. ఇంకొందరు చూసి ఆమోదిస్తున్నారు. ఆమోదించగానే అప్‌డేట్‌ కావాలి. కానీ ‘నోటీస్‌ జనరేటెడ్‌’ అని వచ్చేస్తుంది. ఇక కలెక్టర్‌ లాగిన్‌ నుంచి మాయమవుతుంది. దాంతో తాము పరిష్కరించామని కలెక్టర్లు ఫీల్‌ అవుతున్నారు. 14 రోజుల పాటు నోటీస్‌ జనరేటెడ్‌ అనే పదంతో కాలం వెళ్లదీస్తుంది. 15వ రోజున మళ్లీ కలెక్టర్‌ లాగిన్‌లో దర్శనమిస్తున్నదని ఓ సీనియర్‌ అధికారి అన్నారు. ఈ కిటుకు వెనుక మతలబు ఎక్కడున్నది? ధరణి పోర్టల్‌ ప్రోగ్రామింగ్‌లో లోపాలతో జరుగుతుందా? లేదంటే మరే ఇతర అధికారాలు కట్టబెట్టకుండా అప్‌డేట్‌ బాధ్యతలను ఒక్కరి దగ్గరే ఉంచుకున్నారా? అన్నది అంతుచిక్కడం లేదు. సహజంగా కలెక్టర్‌ అప్రూవ్డ్‌ అనగానే డేటా అప్‌డేట్‌ కావాలి. కానీ కొత్త కొర్రీ ఏమిటో మాత్రం అర్థం కావడం లేదు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట తదితర జిల్లాల్లో వేలాదిగా దరఖాస్తులు పెండిరగులో ఉన్నాయి. గత నెల 14న సిద్ధిపేట జిల్లా ములుగులో పైలెట్‌ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి హరీష్‌ రావు, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, టీఎస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ ఎండీ వెంకటేశ్వర్‌ రావు, కలెక్టర్‌ ప్రశాంత్‌?జీవన్‌ పాటిల్‌ వంటి అతిరథ మహారథులెందరో పాల్గొన్నారు. ఇందులో 272 దరఖాస్తులు వచ్చాయి. 132 దరఖాస్తులను మాత్రం పరిష్కరించడానికి అవసరమైన మాడ్యూల్స్‌ లేవు. మిగతా వాటిని పరిష్కరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కలెక్టర్‌ ఆ దరఖాస్తులను ఆమోదించారు. కానీ ఇప్పటి వరకు అప్‌డేట్‌ కాలేదు. అంటే అపరిష్కృతంగానే మిగిలాయి. అదేంటని ములుగు తాసీల్దార్‌ ప్రవీణ్‌?కుమార్‌ని అడిగితే తనకేం తెలియదని, అంతా కలెక్టరేట్‌ వాళ్లే చూస్తున్నారన్నారు. తనకు ఆ వివరాలేం రాలేదన్నారు. అంత పెద్ద పెద్ద అధికారులు వచ్చి పరిష్కరిస్తే ధరణి పోర్టల్‌లో కనిపించకపోవడం ఏమిటి? అనుకుంటున్నారా! అదే మరి.. ధరణి పోర్టల్‌ సాంకేతికత మహిమాన్వితం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *