కన్నా టార్గెట్‌ గా కమలం అడుగులు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల24న గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం హాజరుకాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటి సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశానికి గుంటూరును వేదికగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యచరణ అంశాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ, జిల్లాల వారీగా కమిటిల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జాతీయ నాయకత్వం నుంచి నేతలు కూడా హజరయ్యే అవకాశం ఉంది.
గుంటూరుకు చెందిన కీలక నేత కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో జాయిన్‌ అయ్యారు. దీంతో ఇప్పడు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు గుంటూరులోనే సమావేశం కాబోతున్నారు. గుంటూరు కేంద్రంగా రాజకీయ వ్యూహాలు, పార్టీ విస్తరణ, జిల్లాలో నూతన నాయకులను పార్టీలోకి చేర్చుకునే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కన్నా పార్టీని వీడిన తరువాత చాలా మంది నాయకులు పార్టీని వీడతారని భావించారు. అందుకు భిన్నంగా చాలా మంది నాయకులు భారతీయ జనతా పార్టీలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారందరికి భరోసా కల్పించటంటతో పాటుగా పార్టీని మరింతగా బలోపేతం చేసే విషయంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై క్లారిటి ఇచ్చే అవకాశం ఉంది.భారతీయ జనతా పార్టీలోకి కీలక నేతలు, పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని ప్రచారం నడుస్తోంది. తాజాగా గుంటూరుకు చెందిన తులసి సీడ్స్‌ అధినేత, పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్‌ వి మురళీధరన్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. గుంటూరుకు చెందిన తులసీ సీడ్స్‌ అధినేత తులసీ రామచంద్ర ప్రభు 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. కన్నా లక్ష్మి నారాయణపై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం పోటీ చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కేంద్రంగా కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడి హోదాలో పని చేసిన కన్నా ఆ తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరారు. దీంతో కాపు సామాజికవర్గం నుంచి కన్నా లక్ష్మినారాయణ, స్థానంలో తులసి రామ చంద్ర ప్రభును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కన్నా లక్ష్మినారాయణ గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అదే స్దానంలో భారతీయ జనతా పార్టీ నుంచి తులసి రామ చంద్ర ప్రభు బరిలోకి దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *