తమ్ముళ్లలో జూనియర్‌ టెన్షన్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌తో బీజేపీ అగ్రనేత.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏ ముహూర్తన భేటీ అయ్యారో కానీ.. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో హీరో పేరు మార్మోగిపోతోంది. తమ పార్టీ ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు.. ఏపీ బీజేపీ నేతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఇంకోవైపు అధికారపార్టీ వైసీపీ అయితే టీడీపీని.. చంద్రబాబును కార్నర్‌ చేస్తోంది. ఏతావాతా టీడీపీ వైరిపక్షాలన్నీ ఎన్టీఆర్‌ జపం అందుకున్నాయనే చెప్పాలి.ఏపీలో ఎన్టీఆర్‌ విషయంలో వైసీపీ, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌కు టీడీపీ నాయకులకు సర్రుమంటోందట. అక్కడ జరిగిందేంటో..? జరగబోయేదేంటో..? కానీ.. టీడీపీ నేతలు తీవ్ర అసహనంలో ఉన్నారట. అమిత్‌ షా, ఎన్టీఆర్‌ భేటీ కేవలం ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే పరిమితమని.. అంతకు మించి రాజకీయ ప్రాధాన్యం లేదని ముక్తసరిగా స్పందిస్తున్నారు. ఆ మధ్య బుద్దా వెంకన్న అదే చేశారు. మిగతా వాళ్లు ఈ సమస్య తమకు పట్టని అంశంగా లైట్‌ తీసుకుంటున్నారట. కానీ.. లోలోన మాత్రం ఉడికిపోతున్నారట టీడీపీ నేతలు.గట్టిగా కౌంటర్‌ ఇద్దామని స్క్రీన్‌ ముందుకు వద్దామా.. అంటే ఏం చేయలేని పరిస్థితిలో టీడీపీ లీడర్లు ఉన్నారట. జూనియర్‌ ఎన్టీఆర్‌ అనగానే అది ఫ్యామిలీ మేటర్‌గానే పరిగణిస్తున్నారట. గతంలో ఒకటిరెండు సందర్భాల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రస్తావించిన వారికి అధినాయకత్వం నుంచి అక్షింతలు పడ్డాయి. దాంతో తాజా రగడలో రియాక్ట్‌ అవుదామన్నా.. మనకెందుకు వచ్చిన గొడవలే అని నేతలు సైడ్‌ అవుతున్నారట. కాకపోతే అమిత్‌ షా`జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ తర్వాత ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి మాత్రం కౌంటర్‌ ఇచ్చి తీరాలనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట.చంద్రబాబుకు కౌంటర్‌గా జూనియర్‌ను బీజేపీకి తెర విూదకు తెస్తోందని.. టీడీపీలో ఉన్న చాలా మంది బీజేపీ పంచన చేరతారనే రీతిలో వైసీపీ నేతల కామెంట్స్‌ ఉన్నాయి. కొందరు బీజేపీ నేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని తమ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారట. వీటికి చెక్‌ పెట్టకపోతే టీడీపీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన పార్టీలో ఉందట. ఇప్పుడు అమిత్‌ షా, ఎన్టీఆర్‌ భేటీ అని కాదుకానీ.. 2019 తర్వాత టీడీపీలో అడపాదడపా ఎన్టీఆర్‌ పేరుపై రచ్చ అవుతూనే ఉంది. కుప్పంలో తరచూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు? బ్యానర్లు.. జెండాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆయన సమక్షంలోనే కేడర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రశ్నించిన పరిస్థితి. ఆ సమయంలో చంద్రబాబు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. కృష్ణాజిల్లాలోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు కలకలం రేపాయి. అలాగే పార్టీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తారని ప్రకటన చేశారు. ఇలా వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్‌ అంశం చర్చగా మారుతూనే ఉంది.గతంలో ఒకసారి టీడీపీ తరఫున జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేశారు కానీ.. తర్వాత టీడీపీ కార్యక్రమాల్లో కనిపించింది లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో బిజీ అయ్యారు. వివిధ సందర్భాల్లో రాజకీయాలపై విూడియా ప్రశ్నించినా.. ఇది సమయం సందర్భం కాదని సమాధానం దాటవేస్తున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడు అమిత్‌షా జరిగిన భేటీ కొత్త రచ్చకు కారణమైంది. మరి.. టీడీపీ వీటికి సమాధానం చెబుతుందో లేదో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *