గవర్నర్‌ వర్సెస్‌ సీఎం…

చెన్నై, జూన్‌ 30
గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆగ్రహంతో ఉన్నారు. అర్థరాత్రి గవర్నర్‌కు లెటర్‌ రాసిన స్టాలిన్‌…మంత్రి సెంథిల్‌ బాలాజీ తొలగింపు అంశాన్ని ప్రస్తుతానికి హోల్డ్‌ చేస్తున్నట్టు చెప్పారు. అటార్నీ జనరల్‌ సంప్రదించి న్యాయసలహా తీసుకుంటున్నట్టు వివరించారు. ఉద్యోగాలకు నోటు కేసులో అరెస్టైన మంత్రి వి.సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి తప్పిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. మనీలాండరింగ్‌ సహా పలు అవినీతి కేసుల్లో సెంథిల్‌ బాలాజీ తీవ్రమైన క్రిమినల్‌ ప్రొసీడిరగ్స్‌ ఎదుర్కొంటున్నారని రాజ్‌ భవన్‌ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించింది గవర్నర్‌ కార్యాలయం. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న ఓ క్రిమినల్‌ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.గవర్నర్‌ ఆదేశాలను ప్రభుత్వం చట్టపరంగా సవాల్‌ చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ఒక మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించే అధికారం గవర్నర్‌ రవికి లేదని స్టాలిన్‌ అన్నారు. దీనిపై ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. 2011 నుంచి 2014 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రి ఉన్న సెంథిల్‌ బాలాజీ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని కేసు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని జూన్‌ 14న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది.అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఛాతీలో నొప్పి రావడంతో సెంథిల్‌ బాలాజీని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న టైంలో సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన భార్య మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు మంత్రి సెంథిల్‌ బాలాజీని తదుపరి చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించింది. దీంతో కోర్టు సెంథిల్‌ బాలాజీకి ఈ నెల 12 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.ఈలోగా సెంథిల్‌ బాలాజీ వద్ద ఉన్న శాఖలను మంత్రులు తంగమ్‌ తెన్నరసు, ముత్తుస్వామికి కేటాయించింది ప్రభుత్వం. ఆయనను పదవి నుంచి మాత్రం తొలగించలేదు. సెంథిల్‌ బాలాజీని శాఖలు లేని మంత్రిగా కొనసాగిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలు లేని మంత్రిగా కొనసాగేందుకు గవర్నర్‌ నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీంతో సెంథిల్‌ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి ఉత్తర్వులు జారీ చేశారు. సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి గవర్నర్‌ తొలగించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిని సీఎం స్టాలిన్‌ సహా పలువురు అధికార పార్టీ నేతలు ఖండిరచారు. గవర్నర్‌కు అలాంటి అధికారమే లేదని స్పష్టం చేస్తున్నారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *