వేటా… వెయిటా…

కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిరదన్న చందంగా తయారైంది టీ`కాంగ్రెస్‌ లో పరిస్థితి. పార్టీ గాడిలో పడుతుందని పీసీసీని మార్చితే.. ఆ పదవిలో కొత్త వ్యక్తిని కూర్చోబెట్టిన నాటి నుండి కొత్త తలనొప్పులు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. పూటకొకరు అలక.. రోజుకో వివాదం అన్నట్లుగా హస్తం పార్టీలో వార్‌ కొనసాగుతోంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పదవికి, పార్టీకి రాజీనామా చేయడం, తమకు బద్ద శత్రువైన బీజేపీలో చేరిపోవడం కాంగ్రెస్‌ కు మింగుడు పడని అంశంగా మారిపోయింది. ఈ వ్యవహారం పార్టీలో రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారడంతో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అంశం రోజుకో ట్విస్ట్‌ తీసుకుంటోంది.చేరికలతో నిన్నా మొన్నటి వరకు ఫుల్‌ జోష్‌ విూదున్న కాంగ్రెస్‌ లో ఒక్కసారిగా రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ సీన్‌ మొత్తం మార్చేసింది. దాంతో వెంకట్‌ రెడ్డి సైతం పార్టీ వీడుతున్నారనే టాక్‌ జోరందుకుంది. అయితే తాను పార్టీ వీడబోయేది లేదని చెబుతూనే.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెంకట్‌ రెడ్డి విషయంలో అనుమానపు చూపులకు ఆస్కారం కలిగిస్తోంది. చండూరు సభలో తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని వెంకట్‌ రెడ్డి కోరారు. ఆ మేరకు రేవంత్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌ క్షమాపణలు చెప్పారు. కానీ వెంకట్‌ రెడ్డి మాత్రం వెనక్కి దగ్గేదేలేదంటున్నారు. తనను పిలిస్తే ప్రచారానికి వెళ్లే విషయం ఆలోచిస్తానని గతంలో చెప్పిన వెంకట్‌ రెడ్డి.. తీరా ఇప్పుడు ప్రచారం మాట అలా ఉంచితే అధిష్టానం రాయబారం సాగించేందుకు నియమించిన వ్యక్తులను సైతం ఇంటికి రావాల్సిన అవసరం లేదని హుకుం జారీ చేయడం మరింత హాట్‌ టాపిక్‌ అవుతోంది. దీంతో ఆయన విషయంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన పార్టీ మారే నిర్ణయంతో ఉన్నారని, కాకుంటే నేరు పార్టీకి రాజీనామా చేయకుండా కొత్త ఎత్తుగడ వేస్తున్నాడనే ప్రచారం కాంగ్రెస్‌ శ్రేణుల్లోని ఓ వర్గం నుండి వ్యక్తం అవుతోంది.తన సోదరుడు రాజగాపాల్‌ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ లు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయన స్వార్థం కోసమే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తోందని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ కు ఉన్న సానుభూతి మునుగోడులో బీజేపీకి ఇక్కడ లభిస్తుందా? అనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి అనుభవంతో సానుభూతి లేకుండా పార్టీ నుండి బయటకు వెళ్తే అది మొదటికే మోసం వస్తుందని వెంకట్‌ రెడ్డి గ్రహించినట్లు టాక్‌ వినిపిస్తోంది. తనంతట తాను వెళ్లకుండా ఉండాలని ఇలా చేయడం వల్లే తన విషయంలో మరింత సానుభూతి పెరిగేలా ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పార్టీ సస్పెండ్‌ చేస్తే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లిపోవాలనే నిర్ణయంతో వెంకట్‌ రెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కోమటిరెడ్డి బ్రదర్స్‌ కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి మధ్య గ్యాప్‌ ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఢీ కొట్టబోయే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వెంకట్‌ రెడ్డికి స్వయానా తమ్ముడు కావడమే ఇక్కడ కీలకాంశం. మునుగోడులో ప్రచారానికి దిగితే అది తన సోదరుడికి వ్యతిరేకంగా పని చేయాల్సి వస్తుంది. ఒక వేళ తమ్ముడికి మద్దతుగా నిలబడితే పార్టీలో పరువుపోతుంది. ఈ సందిగ్దంలో వెంకట్‌ రెడ్డి ఉన్నారని, అందువల్లే పార్టీలో అనవసరపు పట్టుదలకు పోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇంత జరిగాక కూడా పార్టీలో వెంకట్‌ రెడ్డి కీలక వ్యక్తి అని, మునుగోడులో ప్రచారానికి వస్తారని రేవంత్‌ రెడ్డి పదే పదే చెబుతున్నా.. వెంకట్‌ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ ఇష్యూకు ఎండ్‌ కార్డు వేయాలని అధిష్టానం భావిస్తోంది. పార్టీకి.. వెంకట్‌ రెడ్డికి సయోధ్య కుదర్చాలని అధిష్టానం ఇద్దరు దూతలను నియమించింది. కానీ వెంకట్‌ రెడ్డి మాత్రం తన ఇంటికి ఎవరూ రావొద్దని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. వెంకట్‌ రెడ్డి అలక దీర్ఘకాలంలో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదనే టాక్‌ రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. ఈ నేపథ్యం వెంకట్‌ రెడ్డిపై అధిష్టానం వేటు వేసే సహసం చేస్తుందా? లేక మరికొంత కాలం వెయిట్‌ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా కొనసాగుతున్న వెంకట్‌ రెడ్డి విషయంలో అసలేం జరగనుందనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *