ముందుకు సాగని ఖరీఫ్‌

ఖరీఫ్‌ కాలంలో రెండ్నెల్లు గడిచినా పంటల సాగులో స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ఇటు ఒక మేరకు వర్షాలు అటు ప్రాజెక్టులలో ఆశాజనకంగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ సేద్యం సాగట్లేదు. నీటి సౌకర్యం ఉన్న ప్రదేశాల్లో ఈపాటికి జోరుగా వరి నాట్లు, వానల వలన మెట్ట ప్రాంతాల్లో అపరాలు జోరుగా పడాల్సి ఉండగా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. పత్తి మినహా తతిమ్మా అన్ని పంటలూ తక్కువగా సాగైనట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. జులై నెలాఖరు వచ్చినా ఇంకా సాధారణ సాగులో 25 శాతం లోపు సాగు కాని జిల్లాలు ఎనిమిది ఉన్నాయి. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికీ సాధారణ సాగులో 25 శాతం లోపు కూడా సాగు కాని పంటలు జొన్న, రాగి, ఇతర తృణధాన్యాలు, మినుములు, ఉలవలు, మిరప. పొగాకు. మిరప, పొగాకు సాగుకు ఇంకా సమయం ఉందనుకున్నా మిగతావన్నీ మెట్ట పంటలు. ఒక మోస్తరు వానలు పడ్డా వాటిని సాగు చేస్తారు. ఇప్పటికి ఆహారధాన్యాలు 31 శాతం, అన్ని పంటలూ కలుపుకొని 39 శాతం మేర సాగయ్యాయి.భూగర్భ జలాలు బాగున్నప్పటికీ, డెల్టా కాల్వలకు ఎప్పటి కంటే ముందుగానే సాగునీరు విడుదల చేసినప్పటికీ వరి నాట్లు ఊపందుకోలేదు. సాధారణ సాగులో ఇప్పటికి 31 శాతమే నాట్లు పడ్డాయి. ఇప్పటికి కావాల్సిన సాగులో 81 శాతమే వరి సాగైంది. ముందటేడు, నిరుటి కంటే సైతం తక్కువగా నాట్లు పడ్డాయి. వరి ఎక్కువగా సాగయ్యే శ్రీకాకుళంలో 41 శాతం, కాకినాడ 43 శాతం, కోనసీమ 48 శాతం, కృష్ణా 37 శాతం, బాపట్లలో 11 శాతం మేర నాట్లు పడ్డాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరులో 50 శాతానికి మించి నాట్లు పడ్డాయి. నెల్లూరులో 76 శాతం నాట్లు పడ్డప్పటికీ నీటి లభ్యతకు, సాగుకు మధ్య పొంతన కుదరట్లేదు. నెల్లూరులో సాధారణంగా 33 వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా సోమశిలలో నీటి నిల్వలు ఉన్న కారణంగా ముందటేడు 35 వేల హెక్టార్లు, నిరుడు 41 వేల హెక్టార్లలో ఈ పాటికే నాట్లు పడ్డాయి. సోమశిలలో నిరుటి కంటే ఈ మారు రెండు టిఎంసిలు ఎక్కువ నీరున్నప్పటికీ నాట్లు మాత్రం 25 వేల హెక్టార్లలోనే వేశారు. గతంలో కృష్ణా డెల్టా నారుమళ్లకు నీటి సమస్య ఎదురయ్యేది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా బ్యారేజికి నీటిని తోడిపోసి నారుమళ్లను కాపాడేవారు. ఈ ఏట ఆ అవసరం ఇంకా రాలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిరుటి కంటే నీటి నిల్వలు ఎక్కువున్నాయని, పులిచింతలలో సైతం నీరుండటం వలన మున్ముందు కూడా పట్టిసీమ అవసరం పడదని చెబుతున్నారు.
విపత్తు నష్టాలు, పంటకు ధరలు గిట్టుబాటు కానందున క్రమేపి రాయలసీమలో వేరుశనగ సాగు నుంచి రైతులు దూరం జరుగుతున్నారు. ఈ ఏట ఆ ధోరణి మరింత పెరిగింది. సాధారణంగా తొలకరి వానలకే విత్తుతారు. రాయలసీమలో వానలు బానే పడ్డప్పటికీ సాగులో పురోగతి లేదు. ఇప్పటికి 45 శాతం విస్తీర్ణంలోనే సాగైంది. అనంతపురం జిల్లాలో 39 శాతం, శ్రీసత్యసాయి 51 శాతం, కర్నూలు 35 శాతం, కడప 40 శాతం, చిత్తూరులో 63 శాతం సాగైంది. జులై దాటితే వేరుశనగకు అదను తప్పుతుంది.ఖరీఫ్‌లో ఒక మేరకు పప్పుధాన్యాలు సాగవుతాయి. వాటిలోనూ కందులు ఎక్కువగా సాగవుతాయి. ఈ మారు 27 శాతమే కందులు సాగయ్యాయి. మొక్కజొన్న మాత్రం కొంత పరవ్వాలేదనిపిస్తోంది. నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబిన్‌ ఆశాజనకంగా ఉన్నాయి. వాణిజ్యపంట పత్తి సాగులో వేగం ఉంది. అయితే వర్షాల కారణంగా రెండు మూడు తడవలు విత్తుకోవాల్సి వచ్చింది. ఆ మేరకు రైతులకు పెట్టుబడులు అధికమయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *