అతని వల్లే ఓడిపోయాం.. తిలక్ వర్మ మాత్రం సూపర్.. ఓటమిపై కెప్టెన్ హార్దిక్ ఏమన్నాడంటే..?

రెండో టీ20 మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై హార్దిక్ ప్రశంసలు కురిపించాడు. కాగా రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ..‘‘నేను నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. పిచ్ నెమ్మదిగా ఉంది. మేము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఇక్కడ 160 ప్లస్ లేదా 170 పరుగులు మంచి స్కోర్‌గా చెప్పవచ్చు. కానీ మేము అంతకన్నా తక్కువ స్కోర్ సాధించాము. ప్రస్తుతం మా బ్యాటర్లు మరింత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత మా టాప్ 7 బ్యాటర్లపై మాకు నమ్మకం ఉంది. ఇక మా బౌలర్లు జట్టును గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జట్టు సమతూకంగా ఉండేలా చూడడంతోపాటు ఆటగాళ్లంతా విజయం కోసం పోరాడాలి. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. తిలక్ వర్మ ఎడమ చేతి బ్యాటర్ కావడంతో మాకు కుడి, ఎడమ కలయిక సరిపోయింది. అతను ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తిలక్‌కు ఇది కేవలం రెండో మ్యాచ్‌లా అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతున్నాడు. ఇక వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. అతని ఆట తీరుతో మాకు స్పిన్నర్లను రోటేట్ చేయడం కష్టంగా మారింది. అతడి ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది.’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే టీ20 సీరీస్‌లో భారత్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో మరోసారి టీమిండియా చతికిలపడింది. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యం వరుసగా రెండో టీ20ల్లోనూ భారత్‌కు ఓటమిని రుచి చూపించింది. 152 పరుగులను కాపాడే క్రమంలో బౌలర్లు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకనొక దశలో వెస్టిండీస్‌ను 129/8తో కష్టాల్లోకి నెట్టి గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆ జట్టు టేలెండర్లు అకేల్ హోసేన్(16), అల్జారీ జోసెఫ్(10) అద్భుతంగా పోరాడడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. నికోలస్ పూరన్(67)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక అంతకుముందు బ్యాటింగ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(51) తప్ప బ్యాటింగ్‌తో ఇతరులెవరూ రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. కాగా ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 0-2తో వెనుకబడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *