పట్టణానికి వెళ్లేది ఎలా

అదిలాబాద్‌, జూలై 7
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవులే కాదు.. పచ్చదనంతోపాటు వాగులు, వంకలకు పెట్టింది పేరు.. అడవుల నుంచి జాలువారే వర్షపునీటితో ఏర్పడిన వాగులు మరిన్ని ఉన్నాయి. వర్షాకాలం అవి ఉగ్రరూపం దాల్చి సవిూప గ్రామాలను ముంచెత్తుతాయి. రోడ్డు మార్గాలు లేక.. వాగులపై వంతెనలు లేక.. ఆయా ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఏటా వాగులు దాటే క్రమంలో వరద ఉధృతిలో కొట్టుకుపోయి అనేక మంది ప్రాణం కోల్పోతున్నారు. ఏండ్ల నుంచి ఇలాంటి అవస్థలు ఉన్నా.. వంతెనల నిర్మాణాల్లో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా మారుమూల పల్లెలకు ప్రయాణ సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఏజెన్సీలో గిరిజనులు, నిరుపేదలకు వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల సవిూపంలోని వాగులపై వంతెనలు నిర్మించి రాకపోకలకు మార్గం సుగుమం చేయాలని అనేక ఏండ్ల నుంచి పాలకులకు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో హావిూలు గుప్పించడం.. ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తే.. నిత్యావసర సరుకులు, వ్యవసాయానికి పురుగుమందులు, ఇతర సామాగ్రి తీసుకెళ్లేందుకు కూడా వీలుండని దుస్థితి. వాగులపై వంతెనలే కాకుండా మారుమూల గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు.జిల్లాలో అటవీ ప్రాంతం అధికంగా ఉండటంతో ఏజెన్సీలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు వివిధ పనుల నిమిత్తం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కానీ చాలా గ్రామాల సవిూపంలో వాగులు, వంకలు ఉండటం.. వర్షాకాలంలో ఉగ్రరూపం దాల్చి దాటనీయని పరిస్థితి ఉంటుంది. సకాలంలో నిత్యావసరాలు, మందులు, ఇతర వస్తువులు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాగులపై వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఆదిలాబాద్‌ జిల్లాలోనే 133 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పెద్దవాగు, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా తదితర నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవరోధాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వివిధ పీహెచ్‌సీల్లో బర్త్‌ వెయిటింగ్‌రూంలు ఏర్పాటు చేసి గర్భిణులను ప్రసవం కోసం ముందస్తుగానే వీటిలోకి చేరుస్తున్నారు.కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలం సస్మీర్‌ వద్ద వాగుపై వంతెన లేదు. వర్షం కారణంగా వరదొస్తే సోమిని, సవిూర్‌, మొగవెల్లి, నాగేపల్లి, ఇప్పలగూడ, పాత సోమిని తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అత్యవసర పరిస్థితిలోనూ బయటకు వెళ్లలేని పరిస్థితి. కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా వాగు దాటుతూ ప్రాణం విూదికి తెచ్చుకుంటున్నారు.ఉట్నూర్‌ మండలం నర్సాపూర్‌(జే) గ్రామానికి వెళ్లే దారిలో వాగుపై వంతెన లేకపోవడంతో ఎడ్లబండిపై ఇలా వాగు దాటుతున్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతి పెరగడంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలులేకుండా పోతుంది.చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌`నాయకపు గూడకు వెళ్లే వాగుపై నిర్మిస్తున్న వంతెన అసంపూర్తిగా ఉంది. దీంతో వర్షాకాలంలో అటువైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.మండలంలోని దింద, కేతిని వాగుపై లోలెవల్‌ వంతెన ఉంది. కానీ వర్షాకాలంలో దాటే వీలుండదు.కెరమెరి మండలం అనార్‌పల్లి సవిూపంలోని వాగుపై వంతెన లేకపోవడంతో అనార్‌పల్లి, కరంజివాడ, పెద్ద కరంజి, జన్కాపూర్‌, బోరిలాల్‌గూడ, లక్ష్మపూర్‌, అందుగూడ, ఇంద్రనగర్‌, శంకర్‌లొద్ది, కోట, గోండుగూడ తదితర గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. ఏండ తరబడి ఈ అవస్థ ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *