‘జైలర్’ మూవీ రివ్యూ.. రజనీకాంత్ హిట్ కొట్టినట్టేనా?

చాలా రోజుల నుంచి తలైవా రజనీకాంత్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై చాలా బజ్ క్రియేట్ అయింది. జైలర్ తో తలైవా హిట్ అందుకున్నాడా? సినిమా ఎలా ఉంది?
నటీనటులు : రజనీకాంత్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, వినాయకన్, రమ్యకృష్ణ, తమన్నా, మర్నా మీనన్, సునీల్, నాగబాబు, యోగిబాబు తదితరులు..
దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్, నిర్మాణం : సన్ పిక్చర్స్, సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్, ఛాయగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్

రజనీకాంత్ సినిమా అంటే ఎన్నో అంచనాలు. ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తారు. దీనికితోడు.. తెలుగు, కన్నడ, మలయాళం, బాలీవుడ్ నుంచి కూడా పెద్ద స్టార్స్ నటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంతకీ సినిమా ఎలా ఉంది?

కథ ఏంటంటే..
ముత్తు వేల్ పాండియన్(రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. భార్య విజయ(రమ్యకృష్ణ) కుమారుడు, కోడలు, మనవడితో హాయిగా ఉంటాడు. ముత్తు కుమారుడు అర్జున్(వసంత్ రవి) పోలీస్ అధికారి. ఓ కేసు గురించి చాలా ఏళ్లుగా దర్యాప్తు చేస్తుంటాడు. ఈ కేసును వదిలేయాలని కొంతమంది నుంచి బెదిరింపులు వస్తాయి. అయినా పెద్దగా పట్టించుకోడు. దీంతో ఒక రోజు అర్జున్ కనిపించకుండా పోతాడు. పోలీస్ ఉన్నతాధికారులు అర్జున్ చనిపోయాడని అనుకుంటారు. కానీ కన్న కొడుకు కనిపించకపోయేసరికి.. ముత్తు తట్టుకోలేడు.

తన కొడుకు ఏమయ్యాడనే విషయం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. దీంతో ముత్తు కుటుంబ సభ్యులపై వర్మ(వినాయకన్) దాడులు చేస్తూ ఉంటాడు. ముత్తు కొడుకు ఏమయ్యాడు? వర్మ ఎవరు? ముత్తు కుటుంబానికి ఏమైనా అయిందా? కుటుంబం కోసం ముత్తు ఏం చేశాడనేది తెలియాలంటే.. జైలర్ సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
అప్పుడెప్పుడో రజనీకాంత్ బాషా సినిమా విడుదలైంది. ఆ సినిమా ఎంతటి హిట్ అనేది అందరికీ తెలుసు. రజనీకాంత్ రెండు షేడ్స్ కనిపిస్తాయి. జైలర్ సినిమా చూసిన ప్రేక్షకలుకు ఆ అనుభవం ఉంటుంది. రెట్రో రజనీకాత్ ను మరోసారి తెరపై చూడొచ్చు. ఇక రజనీ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. రజనీ హీరోయిజం బాగా ఎలివేట్ అయింది. నిజానికి రజనీకి 70 ఏళ్లపైన వయసు అంటే ఎవరూ నమ్మరు. అంతలా ఎనర్జీతో చేసేశాడు. సినిమాలో వీలైనంత ఎక్కువగా తలైవా కనిపిస్తాడు. రజనీ వయసుకు తగ్గ పాత్రే.. కానీ చాలా ఎనర్జీతో ఉంటాడు.

శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ పాత్రలు కూడా ముఖ్యమైనవే. కథలో భాగమై ఉంటాయి. కథనాయకుడికి ఈ ముగ్గురు చేసిన సాయం ఏంటి అనేది తెరపైనే చూడాలి. నటుడు వినాయకన్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. డిఫరెంట్ మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. రజనీ, యోగిబాబు మధ్య వచ్చే కామెడీ బాగుంటుంది. వీటివీ గణేష్ కూడా నవ్విస్తాడు. సునీల్ ను పెద్దగా వాడుకోలేదు. నాగబాబు కూడా కాసేపు కనిపిస్తాడు. ఇక తమన్నా భాటియా ఒక్క పాటలో మెరుస్తుంది.. కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది.జైలర్ సినిమాలో బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు.. రజనీ స్టైల్ కు సూపర్ గా సెట్ అయింది. రజనీకాంత్ హీరోయిజం ఎలివేట్ అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలో కొన్ని ట్విస్టులు కూడా బాగుంటాయి. దర్శకుడు నెల్సన్.. బీస్ట్ తర్వాత.. తన కసిని సినిమాలో చూపించేందుకు ప్రయత్నం చేశాడు.

అయితే సినిమాలోని కొన్ని సీన్లలో క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది. తప్పదు ప్రేక్షకుడు భరించాలి. సినిమా నిడివి ఎక్కువే అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రేక్షకుడు అలసిపోతాడు. ఫస్ట్ హాఫ్ వేగంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించింది. మళ్లీ క్లైమాక్స్ లో వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కథపై దర్శకుడు కాస్త కన్సంట్రేట్ చేస్తే.. వేరేలా ఉండేది. కొత్త కథేమి కాదు.. కొన్ని ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ప్రేక్షకుడు ఊహించగలుగుతాడు. ఇక పాటల విషయానికి వస్తే.. తమన్నా.. నువ్ కావాలయ్యా పాట తప్పిదే.. హమ్మింగ్ చేసుకునేందుకు వేరే పాట ఏదీ లేదు.చివరాఖరకు.. జైలర్ సినిమాకు వెళ్తే.. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు.. సెకండ్ హాఫ్ చూసి.. కొంచెం నిరాశ చెందుతారు. క్లైమాక్స్ కు కాస్త హై దొరుకుతుంది. రజనీ హీరోయిజం కోసం సినిమాకు వెళ్లొచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *