ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ వింత విజ్ఞప్తి

వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను కోరారు. పాత తరం ప్రజలు నలుగురు లేదా ఐదుగురు పిల్లల్ని కనడం వల్లనే మన సమాజం బలంగా ఏర్పడిందని అన్నారు. అమ్మమ్మలు, నానమ్మలకు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉండేవారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుందామని.. దాన్ని పునరుజ్జీవింపజేద్దామని పిలుపునిచ్చారు. పెద్ద కుటుంబాలు రష్యా ప్రజలందరికీ కట్టుబాటు, జీవన విధానంగా మారాలన్నారు. కుటుంబం అనేది కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదని.. ఆధ్యాత్మికతకు, నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల వారు రష్యా జనాభాను సంరక్షించడం, పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని.. తద్వారా ప్రపంచంలో రష్యా మరింత బలోపేతం అవుతుందని పుతిన్ చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్స్ మరణించిన సంఖ్య సుమారు 3,00,000 దాడి ఉంటుందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే.. 8,20,000 నుంచి 9,20,000 మంది వరకు రష్యన్ పౌరులు దేశం విడిచి పారిపోయి ఉంటారని ‘రష్యా పాలసీ గ్రూప్‌’ పేర్కొంది. దీనికితోడు.. ఉక్రెయిత్‌తో యుద్ధం కారణంగా పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతోందని అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే.. దేశ జనాభాను పెంచడంలో ఆ దేశం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని మహిళలకు పిలుపునిస్తోంది. 2023 జనవరి 1న రష్యా జనాభా 146,447,424గా ఉంది. 1999లో పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ సంఖ్య తగ్గుతూ వస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *