కమలం గూటికి జయసుధ

సినీ పరిశ్రమకు చెందిన మరో సీనియర్‌ నటి, మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్‌ నాయకురాలు బీజేపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున సికింద్రాబాద్‌అసెంబ్లీ నుంచి గెలుపొందిన సహజనటి ..ఆ తర్వాత ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటు కాంగ్రెస్‌ ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో అప్పుడప్పుడు టచ్‌లో ఉంటున్న ఆ నాయకురాలు..ఇప్పుడు బీజేపీ కండువ కప్పుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈవిషయం గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికి ఇప్పుడే అది నిజం అనే విధంగా సంకేతాలు బీజేపీ వర్గాల నుంచి వస్తున్నాయి.సహజనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నారట. ఆపరేషన్‌ ఆకర్ష్‌ లో భాగంగా బీజేపీ నేతలు జయసుధను బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ తరపున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు జయసుధ. ఆ తర్వాత మరోసారి ఓఢపోివడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయ సమావేశాలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు సినిమాల్లో కూడా పెద్దగా నటించడం లేదు. ఈనేపధ్యంలోనే బీజేపీ నేతలు జయసుధను సంప్రదిస్తే తాను రాజకీయాలు, సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి రెస్ట్‌ తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. దానికి తోడు ఒకవేళ బీజేపీలో చేరాల్సి వస్తే తన డిమాండ్లకు అంగీకరిస్తే ఆలోచిస్తానని చెప్పినట్లుగా సమాచారం. అందుకు బీజేపీ నేతలు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
జయసుధ బీజేపీలో చేరడం ఆమెకు, పార్టీకి అవసరం లేకపోవచ్చు కాని…కొంతలో కొంత కాంగ్రెస్‌ నాయకుల్ని తమ అక్కున చేర్చుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే జయసుధను పార్టీలో చేరమని బీజేపీ అగ్రస్థాయి నాయకులు కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీలో కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ, ఫైర్‌ బ్రాండ్‌గా ముద్రవేసుకున్న విజయశాంతి గతేడాది కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. అటు కుష్బూ కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ని కాళీ చేయించడంతో పాటు పొలిటికల్‌ ఇమేజ్‌ పెంచుకోవడం కోసమే జయసుధ లాంటి సీనియర్‌ నటిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. నో చెప్పడానికి ఇష్టపడని జయసుధ.. అన్నీ కుదిరితే ఈనెల 21వ తేదిన పార్టీ కండువా మార్చుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.వైఎస్‌ఆర్‌ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన జయసుధ ..ఆయన మరణానంతరం అనగా 2016లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత అక్కడి నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు పెట్టిన పార్టీ కాబట్టి తిరిగి తనకు సొంత గూటికి వచ్చినట్టుందని కూడా ఆ సందర్భంలో చెప్పారు. ఇక ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరబోతున్నారనే వార్త గట్టిగా వినిపించడంతో సహజనటి అడుగులు ఎప్పుడు కమలదళం వైపు పడతాయి .. ఏ రోజు పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటిస్తారో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *