అప్పుడు ఓ ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు

ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు.. మునుగోడులో జరగబోయే ఉపఎన్నిక మరో ఎత్తు అన్నట్టుగా పాలిటిక్స్‌ ఉన్నాయా? రాజకీయ పార్టీలు చేస్తున్న చిత్ర విచిత్ర విన్యాసాలు ఆసక్తి కలిగిస్తున్నాయా? ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో నోట్ల కట్టలను బయటకు తీసి కాసుల వర్షం కురిపిస్తున్నారా?మనకు దక్కినా.. దక్కకపోయినా? పక్కోడికి మాత్రం దక్కొద్దు. మునుగోడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతోంది ఇదే. రాజకీయ పార్టీలు పోటాపోటీగా నిర్వహిస్తున్న సభలు.. సమావేశాలు పొలిటికల్‌ టెంపరేచర్‌ను పెంచేస్తున్నాయి. సభలను సక్సెస్‌ చేసే క్రమంలో నోట్ల కట్టలు తెగుతున్నాయి. ఐదొందల నోటు చేతిలో పడందే సభలకు జనాలను రాని పరిస్థితి. ఇక్కడ మాత్రం అంతకుమించిన రాజకీయం నడుస్తోంది. ప్రధాన పార్టీలు అన్నీ ఇందులో భాగం కావడం మరో కీలకం అంశం.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక.. చండూర్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సభ నిర్వహించారు. ఈ నెల 20, 21న టీఆర్‌ఎస్‌, బీజేపీలు సభలు జరిగాయి. గతంలో రాజకీయ సభలకు జనాలు స్వచ్ఛందంగా వస్తే.. ఇప్పుడు అలాంటి వారి శాతం బాగా పడిపోయింది. సభా ప్రాంగణాన్ని జనాలతో నింపడానికి డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు. బస్సులు, ఇతర రవాణా సదుపాయాలు ప్రత్యేకంగా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఒక మనిషి సభకు రావాలంటే చేతిలో ఐదొందల నుంచి 8 వందల వరకు పెడుతున్న పరిస్థితి ఉందని మునుగోడులో టాక్‌. అయితే మరో సంప్రదాయం మునుగోడులో పురుడు పోసుకుంది.ఇటీవల ఒక పార్టీ మునుగోడులో సభ నిర్వహిస్తే.. జనాల్ని తరలించేందుకు 5 వందల చొప్పున ఖర్చు చేసింది. ప్రత్యర్థి పార్టీ గ్రామాలకు వెళ్లి ఆ సభకు జనాలు వెళ్లకుండా అడ్డుకుందట. సభకు వెళ్లొద్దు అని ప్రత్యర్థి పార్టీ ప్రతినిధులు అదే జనానికి చేతిలో ఐదొందలు చొప్పున పెట్టిందట. సభకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటే ఇంకా ఇస్తామని ఆశ పెట్టారట. అంటే సభకు వెళ్లితే.. ఐదొందలు.. వెళ్లకపోతే వెయ్యి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అదే పార్టీ ప్రతినిధులు.. తమ సభకు 8 వందలు చొప్పున ఇచ్చి జనాన్ని తోలుకుపోయారట. అయితే అలా డబ్బులకు ఆశపడి వచ్చిన కొందరికి 8 వందలు కాకుండా 3 వందలు చేతిలో పెట్టగానే కస్సు మన్నారు. కూలికెళ్లితేనే 4 వందల నుంచి 5 వందలు వస్తున్నాయి. ఆ పని మానుకుని సభకు వస్తే 3 వందలు ఎలా ఇస్తారని మండిపడ్డారు.
ఎన్నికలంటేనే ఖర్చు. అందులో ఉపఎన్నిక అంటే ఆ ఖర్చుకు హద్దే ఉండదు. మునుగోడులో ఉపఎన్నిక వస్తుందని అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకా తేదీ ఖరారు కాలేదు. కానీ.. ప్రధాన పార్టీలు ముందే గేర్‌ వేయడంతో ఇప్పటి నుంచే నోట్ల వరద పారుతోంది. పార్టీ మారితే లక్షలు ఇచ్చేందుకు నేతలు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో కాస్త డిమాండ్‌ ఉంటే చాలు లక్షలు.. కోట్లు వెచ్చించడానికి వెనకాడటం లేదు. మొత్తానికి ఓటు కోసం కోటి విద్యలన్నట్టుగా మునుగోడు రాజకీయం మారిపోయింది. కాకపోతే విద్యలు కోటి కాదు.. కోటి అంటే అక్షరాల పచ్చనోట్లు కావడమే ఇక్కడ ప్రత్యేకం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *