ఇక కమలం నేతల పర్యటనలు

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు తెలంగాణలో కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు హోరెత్తనున్నాయి. దేశవ్యాప్తంగా చేపడుతున్న లోక్‌సభ ప్రవాసీ యోజనలో భాగంగా కేంద్రమంత్రులు రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఈ యోజన పూర్తి కాగా, మూడో విడతకు ముఖ్యనేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 23న చేవేళ్ల లోక్‌సభ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. అదేరోజు సాయంత్రం చేవేళ్లలో బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ కార్యాలయంలో లోక్‌సభ ప్రవాసీ యోజనలో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జీ సునీల్‌ బన్సల్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రమంత్రుల పర్యటనల సందర్భంగా ఏ ఎంపీ స్థానం పరిధిలో ఎక్కడెక్కడ బహిరంగసభల నిర్వహణతో పాటు స్థానిక ప్రజలతో ఇంటరాక్ట్‌ అయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలనే విషయమై చర్చించారు.రెండువిడతలుగా చేపట్టిన యోజనలో కార్యకర్తలను కలసుకోవడం, క్షేత్రస్థాయి పరిశీలనలు వంటివి ఉండగా, దానికి భిన్నంగా ఈసారి ప్రజలను నేరుగా కలుసుకునేలా మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇంతవరకు గెలవని, రెండోస్థానంలో నిలిచిన, మిత్రపక్షాలకు కేటాయించిన 160 ఎంపీ స్థానాల్లో అత్యధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో లోక్‌సభ ప్రవాసీ యోజనను బీజేపీ అధినాయకత్వం రూపొందించిన విషయం తెలిసిందే. వీటిలో 40 స్థానాల్లో జరిగిన ప్రవాసీ యోజన సమావేశాలకు అమిత్‌షా హాజరయ్యారు.నడ్డా కూడా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించారు, ఇక రాష్ట్రంలోని ఈ 14 సీట్లలో వారిద్దరూ కూడా తరచుగా పర్యటించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నేతల పర్యటనల సందర్భంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ పటిష్టత, పోలింగ్‌ బూత్‌స్ధాయి వరకు బలోపేతం వంటి సంస్ధాగత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రవాసీయోచన రాష్ట్ర ఇన్‌చార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, చింతలరామచంద్రారెడ్డి, లోక్‌సభ నియోజకవర్గాల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *