కాంగ్రెస్‌ అలా..బీజేపీ ఇలా

హైదరాబాద్‌, జూలై 4
అంతర్గత కుమ్ములాటలు తెలంగాణ బీజేపీని గాడితప్పేలా చేశాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ పుంజుకుని బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయంగా మారిందంటున్నారు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సంఘటనలు ‘‘లాస్ట్‌ ది ప్లాట్‌’’ అనడానికి సరిగ్గా సరిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా, ఇప్పటివరకు అంతగా లెక్కల్లో లేని కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారిగా బీజేపీని అధిగమించినట్లు భావిస్తున్నారు. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీదారుగా కాంగ్రెస్‌ మారిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ వర్గంలోని నేతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. నేతల అసంతృప్తితో తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి వరకు అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడానికి శక్తివంతంగా కనిపించిన బీజేపీ ఇప్పుడు నష్ట నియంత్రణలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్‌ను పోటీ నుంచి తప్పించామని, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకూ బీఆర్‌ఎస్‌ కు ఏకైక ప్రత్యామ్నాయం తామే అని చెప్పిన బీజేపీ నాయకత్వంలో అంతర్గత పోరు మొదలైంది. దీనిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకుంది. అధికార బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి బీజేపీ కంటే కాంగ్రెస్‌ను మార్గంగా ఎంచుకుంటున్నారు పలువురు నేతలు. మునుగోడు ఉపఎన్నికలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, బీజేపీ తనను తాను పునరుద్ధరించుకునేందుకు ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరిన వారికి బాధ్యతలు అప్పగించడంతోపాటు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే బండి సంజయ్‌ నాయకత్వాన్ని కొనసాగించాలనే జాతీయ నాయకత్వం ధోరణి, పార్టీలో సీనియర్‌లు కొత్తగా చేరిన వారి మధ్య గ్యాప్‌ మరింత పెంచింది.ఒకప్పుడు కేసీఆర్‌కు సహచరుడు, కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ట్రంప్‌ కార్డ్‌గా అంచనా వేసిన ఈటల రాజేందర్‌ను బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ నుంచి నేతలను బీజేపీలోకి ఆకర్షించే స్థాయికి తెచ్చారు. ఈటల ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2023లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి బండి సంజయ్‌ పార్టీ ఫేస్‌ గా చూపించాలని బీజేపీ భావించినా…అసంతృప్తులు బహిరంగంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించి, బీజేపీ ఎదుగుదలకు భంగం కలిగించారని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండిరటినీ ఎదుర్కోవడానికి బీజేపీ అంత బలంగా లేదని అంటున్నారు.అపర చాణక్యుడు’’ అని పేరు తెచ్చుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం… ఇతర పార్టీలలోని నేతలను పార్టీలో చేర్చుకున్న తర్వాత కలిగే పరిణామాలను అంచనా వేయడంలో విఫలమైందని తెలుస్తోంది. బండి సంజయ్‌ నాయకత్వం విూద నమ్మకంతో జాతీయ నాయకత్వం పార్టీని పణంగా పెడుతోందని అంటున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారు తమ సామర్థ్యాలను గుర్తించడం లేదని లేదా వారి కృషికి తగిన విలువ ఇవ్వడం లేదని బహిరంగంగా చెప్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలనే పెద్ద ఉద్దేశంతో పార్టీలో చేరామని చెప్తున్న నేతలు… పార్టీలో ప్రాధాన్యత కోసం డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ గ్రౌండ్‌ రియాలిటీస్‌ ను బయటపెట్టారు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఫిరాయింపుదారులను బీజేపీలోకి లాగేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఫలితాన్ని ఇస్తున్నాయా అని అడిగిన ప్రశ్నకు, ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో ఉన్న ఈటల ఇలా అన్నారు: ‘‘ఇప్పుడు ఎవరూ బీజేపీలోకి మారడానికి ఇష్టపడడంలేదు. బదులుగా, నేను సంప్రదించిన నాయకులు నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు, నన్ను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరమని కోరారు.’’బీజేపీలో అంతర్గత పోరు మొదలవ్వడంతో…కాంగ్రెస్‌ నాయకత్వం ప్రజల గ్రౌండ్‌ లెవల్‌ సమస్యలపై దృష్టి సారించింది. దీంతో తమను బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయంగా చూపించింది. కర్ణాటక షాక్‌ నుంచి బయటపడి.. పార్టీని గాడిలో పెట్టేందుకు బీజేపీ నాయకత్వం బిజీగా ఉన్న సమయంలో అంతర్గత వివాదాలు చుట్టుముట్టాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ నేతలు ప్రజల సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించడం మానేసి తమలో తాము పోట్లాడుకోవడం గమనార్హం. నాయకత్వంలో మార్పు వచ్చినా, మరేదైనా నష్టాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినా అది..కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు’ అవుతుందనే ఆందోళన బీజేపీ క్యాడర్‌లో ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *