కొడాలి రియలైజ్‌ అయ్యారా…

విజయవాడ, ఆగస్టు 23
కొద్దిరోజుల కిందట మెగాస్టార్‌ చిరంజీవి.. హీరోల రెమ్యునరేషన్‌ గురించి ప్రభుత్వాలకు అవసరం లేదని.. చిత్ర పరిశ్రమ ఒక పిచ్చుకలాంటిదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చిరంజీవి వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నాయకులు స్పందించారు. ఆ సమయంలో ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని కొడాలి నాని అన్నారని చెబుతూ కొన్ని విూడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. తాజాగా కొడాలి నాని చిరంజీవి పుట్టినరోజు నాడు కీలక వ్యాఖ్యలు చేశారు.మెగాస్టార్‌ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడును తాను కానని కొడాలి నాని అన్నారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్‌ చేశారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం గుడివాడలో చిరంజీవి పుట్టిన రోజు కార్యక్రమాల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొడాలి నాని కేక్‌ కట్‌ చేశారు. తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసునని.. తామంతా క్లారిటీ గానే ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవని.. ఆయనను విమర్శించే సంస్కారహీనుడను కాదని నాని అన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు విూద దొల్లారని విమర్శించారు. చిరంజీవికి ,తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం విూదుగా ర్యాలీగా వెల్లినా చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని కొడాలి నాని గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో తాను చిరంజీవిని కలిశానని.. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్‌ రాదా? తాను ఆయన గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు.
తాను శ్రీరామ అన్నా కూడా టీడీపీ, జనసేన పార్టీల నేతలకు బూతు మాటలుగా వినపడతాయని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *