ఇప్పుడు కుక్కల పేరిట దోపిడీ

వరుస ఫైర్‌ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఫైర్‌ సేఫ్టీ అంటూ, వరుసగా కుక్కకాటు ఘటనలు సంభవించినప్పుడు కుక్కల నియంత్రణ అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఉత్తుత్తి హడావుడి చేస్తూ, ఆ తర్వాత షరా మామూలే అన్నట్టు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 21న అంబర్‌పేటలో ఐదేళ్ల చిన్నారి ప్రదీప్‌ పై వీధికుక్కలు చేసిన దాడిలో ఆ చిన్నారి మృతిచెందటం, ఆ తర్వాత నగరంలో వరుసగా పలు చోట్ల కుక్కకాటు ఘటనలు చోటుచేసుకోవటంతో సందడి చేసిన జీహెచ్‌ఎంసీ వెటర్నరీ ఆఫీసర్లు ఇప్పుడు మళ్లీ బేఫికర్‌గా ఫీలవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఘటన జరిగిన తర్వాత ఓసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలను సూచించమని ఆదేశించిన తర్వాత కమిటీ ఎట్టకేలకు 26 సిఫార్సులు చేసిన సంగతి తెల్సిందే. కానీ అంతకు ముందు నుంచే జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు కుక్కల నియంత్రణ విషయంలో తూతుమంత్రంగానే వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. శేరిలింగంపల్లిలో కుక్కలను పెట్టుకొచ్చి స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ చేసే విషయం దేవుడెరుగు గానీ, స్టెరిలైజేషన్‌ ఆపరేషన్ల విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువ కుక్కలకు వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు నిర్వహించాలన్న ఒకేఒక్క ఆదేశంతో అనేక రకాల అక్రమాలకు తెరదీస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవలే చార్మినార్‌ సర్కిల్‌లో పట్టుకున్న కుక్కలకు శేరిలింగంపల్లి సర్కిల్‌లో స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీకి ప్రత్యేకంగా డాగ్‌ పౌండ్‌, యానిమల్‌ కేర్‌ పాయింట్‌ ఉన్నా, శేరిలింగంపల్లిలో ఆపరేషన్లు నిర్వహించటం కేవలం అక్కడ బిల్లులు క్లెయిన్‌ చేసుకునేందుకేనన్న వాదనలున్నాయి.కుక్కకాట్ల ఘటనతో కుక్కల నియంత్రణకు మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన జీహెచ్‌ఎంసీ వెటర్నరీ ఆఫీసర్లు వరుస ఘటనలను తమ అక్రమార్జనకు వరంగా వినియోగిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. అంబర్‌పేట ఘటన జరిగిన తర్వాత శేరిలింగంపల్లి వెటర్నరీ అధికారులు నాలుగైదు రోజులు కుక్కలను పట్టుకెళ్లి వాటికి వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ చేసిన అధికారులు వాటికి పెట్టాల్సిన ఆహారం సైతం నాసిరకం పెట్టి, వాటి పేరిట మెక్కేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అధికారులు గుర్తించి, షెల్టర్‌లో దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నా, సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంతో మళ్లీ పాత వ్యవహారమే కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.కుక్కల నియంత్రణ పేరిట అక్రమాలకు, దోపిడీలకు పాల్పడటంలో శేరిలింగంపల్లి సర్కిల్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి కేవలం వారానికో రోజు మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. నెలకు సుమారు రూ.లక్షన్నర జీతంతో పాటు కారు ఇతర ప్రయోజనాలను పొందుతున్న సదరు అధికారి కుక్కల పేరిట ఓ ఫామ్‌ హౌజ్‌, మరో విల్లాను సంపాదించినట్లు చర్చ జరుగుతుంది.ఏళ్లుగా జీహెచ్‌ఎంసీలో పాతుకుపోయిన ఈ అధికారి సర్కిల్‌లో వెటర్నరీ విధులు నిర్వర్తించాల్సిన కార్మికులను తన ఫామ్‌ హౌజ్‌లో, విల్లాలో పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులకు ఇలాంటి వాటికి కక్కుర్తి పడితే ఇక కుక్కల నియంత్రణ ఎక్కడ జరుగుతుందని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *