చక్రబంధంలో విపక్ష నేతలు

వ్యూహాలు రచిస్తున్న గులాబీ బాస్‌
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో చక్రబంధంలో బంధించేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అవుతుంది. అందుకోసం పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. వారు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గట్టిపోటీనిచ్చే అభ్యర్థులను బరిలోకి దింపే ప్రయత్నాలను షురూ చేసింది. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఇవ్వకుండా ఆ నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావిస్తోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా అధికారపార్టీ పావులు కదుపుతోంది. ప్రతిపక్ష పార్టీలపై పైచేయి సాధించేలా కార్యచరణ సిద్ధం చేసింది.రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను దింపే ప్రయత్నంతో పాటు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలను ఇరుకున బెట్టేందుకు పై చేయి సాధించేందుకు సొంతపార్టీ అభ్యర్థుల పక్షాన రాష్ట్రమంతా తిరగాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అందరి అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయాలి. అదే విధంగా వీరు సైతం నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తుండటంతో వీరిని కదలనీయకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. బండి, రేవంత్‌పై ధీటైన అభ్యర్థులు నిలబడితే పోటాపోటీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో సొంత నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఇతర నియోజకవర్గాలపై ప్రభావం పడనుంది. అంతేకాదు వారి కదలికలను నియోజకవర్గానికే పరిమితం, కట్టడి చేసే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ పార్టీ స్టార్ట్‌ చేసింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గంలో వారిని ఓడిరచే సత్తా ఉన్న ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలను ఇప్పటినుంచే ప్రారంభించినట్లు సమాచారం. 2014, 2018 ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ ఇదే ప్రణాళికలను రూపొందించింది. కేసీఆర్‌ ప్రజల నాడీ తెలిసిన వ్యక్తి. రాజకీయ చతురత అమోఘం. దీంతో ఎప్పుడు ఎన్నికలు వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఏ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని అనేది తెలుసు. ప్రత్యర్థులను ఎత్తులను చిత్తుచేసి రాజకీయ ఎత్తుగడులు వేసి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతారు. అయితే గత ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే రాబోయే ఎన్నికల్లో అనుసరించి మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులను సైతం నియోజకవర్గానికే పరిమితం చేశారు. 2014లో పీసీసీ ప్రెసిడెంట్‌గా పొన్నాల లక్ష్మయ్య జనగాం నుంచి పోటీ చేయగా టీఆర్‌ఎస్‌ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బరిలో దించింది. దీంతో పొన్నాల రాష్ట్రం కన్నా నియోజకవర్గానికే ఎక్కవ సమయం కేటాయించాల్సి వచ్చింది. చివరకు ఒటమిపాలు కావల్సివచ్చింది. అదే విధంగా హుజూర్నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కాసోజుశంకరమ్మను, సాగర్‌లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్యను బరిలో నిలుపడంతో వారు గెలుపుకోసం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 22 నియోజకవర్గా?ల్లో మాత్రం విజయం సాధించింది. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియామకం కావడంతో 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలిపింది. దీంతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కావడంతో పక్కన ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉత్తమ్‌ పద్మావతిని కూడా గెలిపించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలకే కాంగ్రెస్‌ పరిమితం అయింది. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌లో పద్మావతి బరిలో నిలువగా టీఆర్‌ఎస్‌ శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. 2018లో జానారెడ్డి సీఎం రేసులో ఉన్నాడని భావించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి నోముల నర్సింహయ్యను బరిలో నిలుపడంతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నుంచి భూపాల్‌ రెడ్డిని బరిలో నిలుపవడంతో ఓటమిపాలయ్యారు. తిరిగి భువనగిరిపార్లమెంట్‌ నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి నియోజకవర్గానికే కట్టడిచేయాలని భావిస్తుంది. 2018 ఎన్నికలో రేవంత్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన పట్నం నరేందర్‌ రెడ్డి ఓడిరచిన విషయం తెలిసిందే. టీబీజేపీ ప్రప్రథమ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కిషన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ పార్టీ సుధాకర్‌ రెడ్డిని నియమించడంతో గెలుపుకోసం శ్రమించాల్సి వచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కిషన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నుంచి కాలేరు వెంకటేష్‌ పోటీ చేసి విజయం సాధించారు. అదే విధంగా బీజేపీ అధ్యక్షుడిగా 2018లో కే.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయడంతో ఆయనపై టీఆర్‌ఎస్‌ నుంచి ముఠా గోపాల్‌ను నియమించింది. దీంతో లక్ష్మణ్‌ నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ సైతం కరీంనగర్‌ నుంచి 2018లో పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ పై ఓడిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తిరిగి అసెంబ్లీ పోటీ చేయాలని భావిస్తుండటంతో బండిపై మరోసారి బలమైన అభ్యర్థిని బరిలో దింపి నియోజకవర్గానికే పరిమితం చేసేలా టీఆర్‌ఎస్‌ స్కెచ్‌ వేస్తుంది. ఒకవేళ నియోజకవర్గాన్ని వీడి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే ఇక్కడ ఓటమిపాలయ్యే అవకాశం ఉందన్న విధంగా గట్టి అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులకు కళ్లేం వేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *