మరో ఉద్యమానికి ఉద్యోగులు రెడీ…?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులు ఆర్థిక అభద్రతతో సతమతమౌతున్నారా? ప్రభుత్వ తీరుతో విసిగిపోయి మరో ఉద్యమానికి సిద్ధమౌతున్నారా? డీఏలు ఇవ్వకుండా, దాచుకున్న సొమ్ము సైతం తీసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారా? ప్రభుత్వం వారి తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారా? అంటే ఉద్యోగ సంఘాల నాయకుడు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఔననే అంటున్నారు.ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనీ, స్వయంగా సీఎం ఇచ్చిన హావిూలు కూడా నెరవేరడం లేదని, అందుకే మరో ఉద్యమం తప్పని పరిస్థితే కనిపిస్తోందని బొప్పరాజు చెప్పారు. ఆందోళనకు ఉద్యోగుల నుంచే తమపై ఒత్తిడి వస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఉదాశీనంగా ఉంటే సమస్యల పరిష్కారం సాధ్యం కాదనీ, వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సిందేనని జిల్లాల ఉద్యోగ సంఘాలు నుంచి తమపై తీవ్ర ఒత్తిడి వస్తోందని ఆయన వెల్లడిరచారు.జీపీఎఫ్‌, ఎపీ జీఎల్‌ఐ మెడికల్‌ రీయింబర్స్‌ మెంట్‌, సరెండర్‌ లీవులకు సంబంధించి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వటానికి కిందటి మార్చి నెల గడువుగా పెట్టారని.. అయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదనీ అన్నారు. వీటిపై సీఎం జగన్‌ స్వయంగా స్పందిస్తూ జూలై ఆఖరు నాటికి ఇస్తామని హావిూ ఇచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేదని అన్నారు.దీంతో కుటుంబాల్లో పెళ్లిళ్లు వైద్య ఖర్చులు పిల్లలకు ఉన్నత విద్య కోసం డబ్బులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బొప్పరాజు అన్నారు. ఇప్పటి వరకూ ఈ బాపతు దాదాపు 3వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అన్నారు. అలాగే రూ.7000 కోట్ల డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేదంటున్నారు. అలాగే ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్పై ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెబుతున్నారు. తక్షణమే పీఆర్సీ అరియర్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *