పవన్‌ వార్నింగ్‌… పనులు ప్రారంభం

రాజమండ్రి, జూలై 4
వారాహి యాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తరువాత రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజోలు బైపాస్‌ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈనేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్‌ విూడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఈ రోడ్డు పక్కాగా పుననిర్మించాలని కోరుతున్నారు..25వ తేదీన మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ స్థానిక సమస్యలపై మాట్లాడారు. స్థానిక సమస్యలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ఎలా ఉండాలి అన్నదానిపై దృష్టిపెట్టానని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అభివృద్ధి గురించి ఉభయగోదావరి జిల్లాలతో మొదలు పెడదామంటూ ఓటు బ్యాంకు రాజకీయం చేయనన్నారు. మనం గెలిపించిన ఎమ్మెల్యే వెళ్లిపోయాడు కాబట్టి, జనసేన పార్టీ విూద, సింబల్‌ విూద గెలిపించారు కాబట్టి రాజోలు నుంచి వైసీపీ ప్రభుత్వానికి చెబుతున్నాను. స్థానిక వైసీపీ నాయకులకు చెబుతున్నాను. 15 రోజుల సమయం ఇస్తున్నాను. విూరు గనుక రాజోలు బైపాస్‌ రోడ్డు వేయకపోతే నేనే శ్రమదానం చేసి రోడ్డు వేస్తామన్నారు. మాతో గొడవ పెట్టుకోవద్దు.. విూకు రెండు వారాల సమయం ఇస్తున్నాను. రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే గర్భణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటూ మండిపడ్డారు.రాజోలు ఎంట్రన్స్‌లో ఉండే బైపాస్‌ రోడ్డు సుధీర్ఘ కాలంగా పూర్తి అధ్వాన్న స్థితిలోకి మారింది. ఇటువైపుగా భారీ వాహనాలు రావడంతో మరింత దారుణంగా మారింది. దీంతో ఈ రోడ్డుమార్గం ద్వారా వెళ్లాలంటే ఒళ్లు హూనమయ్యే పరిస్థితి. గర్భిణీలు, వృద్ధులు, ఇతర అనారోగ్యంతో బాధపడేవారు ఇటువైపుగా రాకపోకలు చేసే సమయంలో తీవ్ర అవస్థలు పడేవారు. వర్షాకాలంలో అయితే ఎక్కడ బడితే అక్కడ ఉన్న భారీ గుంతల్లో నీరు చేరి ఎక్కడ గుంత ఉందో ఎక్కడ ప్రమాదముందో తెలియక అనేక మంది ప్రమాదాల బారిన పడ్డారు. మలికిపురం సభ వేదికగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపు అధికారుల్లో కదలిక తీసుకువచ్చిందంటున్నారు పలువురు. ప్రభుత్వం రోడ్డు నిర్మించకుంటే 15 రోజుల తరువాత తానే రంగంలోకి దిగి శ్రమదానంచేసి రోడ్డు వేస్తానని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించడంతో ఈ రోడ్డుకు మోక్షం కలిగిందని చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *