క్రాస్‌ రోడ్స్‌ లో భూమా వారసులు

కర్నూలు, నవంబర్‌ 30
వారసత్వ రాజకీయాలను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు. కొందరే అందులో వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. మరికొందరు మాత్రం వారసత్వ రాజకీయాలను కొనసాగించలేక చతికిలపడతారు. నంద్యాలలో భూమా కుటుంబం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. నంద్యాలలో ఒకప్పుడు భూమా నాగిరెడ్డి అంటే తిరుగులేదు. ఇటు నంద్యాల, అటు ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లోనూ ఆ కుటుంబానిదే పై చేయి. నంద్యాలను భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డిలు తమ అడ్డాగా చేసుకుని ఎన్నికయ్యారు. పార్టీ ఏది అన్నది కాదు కేవలం వ్యక్తిగత ఇమేజ్‌ తోనే వారు రాజకీయంగా రాణించగలిగారు. అయితే ఇద్దరి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో వారసులు మాత్రం అంత రాణించలేకపోయారు. ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి ప్రమాద వశాత్తూ మరణించడంతో ఆమె స్థానంలో కుమార్తె భూమా అఖిలప్రియ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు. తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రి అయ్యారు. 2014లో గెలుపును గెలుపు అని చెప్పలేం. అదే భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గంగుల కుటుంబం చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 35 వేల మెజారిటీతో ఓటమి పాలు కావడం వెనక అనేక కారణాలున్నాయి. మంత్రి అయిన తర్వాత భూమా అనుచరులును పట్టించుకోకపోవడం, తల్లి అనుసరించిన బాట నడవకపోవడం ఆమెకు మైనస్‌ గా మారింది.. అలాగే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి 2017లో జరిగిన ఉప ఎన్నికలలో నంద్యాల నుంచి గెలుపొందారు. మంత్రులందరూ అక్కడ మకాం వేసి మరీ గెలిపించుకున్నారు. ఉప ఎన్నిక కావడంతో సహజంగా అధికార పార్టీకి అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డి చేతిలో 30 వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు. తన బాబాయి చూపిన బాటలో పయనించాల్సిన బ్రహ్మానందరెడ్డి మాత్రం అక్కడ పట్టు నిలుపుకోలేకపోయారు. దీంతో అతనికి ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల్లో భూమా కుటుంబం రెండిరటిలో ఓటమి పాలయి కుటుంబ పరువు ప్రతిష్టలను మంటగలిపింది. . ఇక తాజాగా వచ్చే ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జిగా పార్టీ నాయకత్వం ఎన్‌ఎండీ ఫరూక్‌ ను పార్టీ నియమించడంతోనే విషయం అర్థమయింది. దీనికి స్వయంకృతాపరాధమే కారణం. భూమా సన్నిహితులను వీళ్లు దూరం చేసుకుని శత్రువులను పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. జనంలో ఉండకుండా, అనుచరులతో మమేకం కాకుండా సొంత వ్యాపారాలు చూసుకోవడం, వివాదాల్లో చిక్కుకోవడం, ఆస్తి సమస్యలు, భూ తగాదాలు ఇలా ఒక్కటేమిటి… అన్ని రకాలుగా భూమా వారసులు భ్రష?టు పట్టిపోయారన్న టాక్‌ రెండు నియోజకవర్గాల్లో వినపడుతుంది. ఇటు నంద్యాలలో ఇక భూమా కుటుంబం టిక్కెట్‌ ఆశలు వదులుకున్నట్లే. ఇక ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు టిక్కెట్‌ ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఒక్క ఎన్నిక.. అదీ ఉప ఎన్నికలతోనే వీరిద్దరూ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *