భారీ ప్రక్షాళన దిశగా జగన్‌

నెల్లూరు, డిసెంబర్‌ 7
ఏపీ సీఎం జగన్‌ భారీ ప్రక్షాళనకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ దెబ్బ తినడంతో జగన్‌ సైతం ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కెసిఆర్‌, జగన్‌ ఒకటే నన్న భావన ప్రజల్లో ఉంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్‌ జగన్‌ అనుసరించారని ఏపీలోవిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటువంటి కెసిఆర్‌ ఓటమితో జగన్లో అంతర్మధనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కెసిఆర్‌ విషయంలో జరిగిన తప్పులు.. ఏపీలో తన విషయంలో జరగకూడదని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కొంతమంది నాయకులను వదులుకొని కొత్తవారికి టిక్కెట్‌ ఇవ్వాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి తెలంగాణలో సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కేసీఆర్‌ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బీఆర్‌ఎస్‌ కొంపముంచినట్లు తెలుస్తోంది. సీఎంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కు మంచి మార్కులే వేసినా.. దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు పార్టీ క్యాడర్‌ చేసిన పనులే ఓటమికి కారణమని తేలింది. అయితే తెలంగాణతో పోల్చుకుంటే అంతకుమించిన స్థాయిలో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే జగన్కు ప్రమాదం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.ప్రజలకు నేరుగా నగదు పంచుతున్నారు. వారి ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచుతున్నట్లు భావిస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధి లేదని, విధ్వంసకర పాలన కొనసాగుతోందని జగన్‌ సర్కార్‌ పై ఒక రకమైన విమర్శ ఉంది. ఆయన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు తేలుతోంది. ఇటువంటి సమయంలో జాగ్రత్త తీసుకోకుంటే ఘోర పరాజయం తప్పదని కొన్ని రకాల నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో జగన్‌ క్షేత్రస్థాయిలో సర్వేలు, నివేదికలు తెప్పించుకుంటున్నారు. అత్యంత ఘోరంగా పనితీరు ఉన్న ప్రజాప్రతినిధులను పక్కన పెట్టే యోచనలో ఉన్నారు.ఇకనుంచి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను పిలిచి కరాకండిగా తేల్చేయాలని జగన్‌ భావిస్తున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని చూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి అవకాశం కల్పిస్తామని.. నామినేటెడ్‌ పదవి ఇస్తామని వారిని ఒప్పిస్తున్నారు. అదే సమయంలో వెనుకబడిన ఎమ్మెల్యేల కు ప్రత్యామ్నాయంగా కొంతమంది నేతలను గుర్తిస్తున్నారు. వారికే టికెట్‌ కేటాయించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తాజా పరిణామాలతో అధికార పార్టీలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఈ సడన్‌ మార్పుతో నష్టమే తప్ప లాభం ఉండదని సీనియర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే కేసీఆర్‌ ఓటమి, ఏపీలో ప్రజా వ్యతిరేకత దృష్ట్యా జగన్‌ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *