పొత్తులపై పార్టీ శ్రేణులకు జనసేన నోట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే నిర్ణయానికి జనసేన కట్టుబడి ఉందని పార్టీ నేతలకు పవన్‌ కళ్యాణ్‌ స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిన పవన్‌ కళ్యాణ్‌ రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల విషయంలో జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని, వైఎస్సార్సీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, దానికి ఎవరూ లొంగవద్దనిపార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఎన్నికల పొత్తులపై పార్టీల మధ్య రకరకాల ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో కొద్దిమంది జనసేన నాయకులకు పవన్‌ కళ్యాణ్‌ తన మనసులో మాటను వివరించినట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ పార్టీశ్రేణులకు అంతర్గతంగా దీనిపై ఒక నోట్‌ పంపారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై పార్టీశ్రేణులు అనవసర ఆందోళన చెందవద్దని అందులో పేర్కొన్నారు.రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించారని, పవన్‌ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని జనసేన పార్టీ తమ శ్రేణులను అప్రమత్తం చేసింది. ప్రతిపక్ష నాయకుల పేర్లతో, జనసేన నాయకుల పేర్లతో పొత్తులపై మాట్లాడారన్నట్లుగా తప్పుడు ప్రకటనలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టించడమే ఈ క్రీడలో భాగంగా వ్యవహరిస్తున్నారని తెలియచేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ విషయంలో గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను పార్టీ నాయకులకు పవన్‌కల్యాణ్‌ పారదర్శకంగా తెలియజేస్తారన్నారు.టీడీపీతో పొత్తు విషయంలో ఇటీవలి కాలంలో సోషల్‌ విూడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఒంటరిగానే జనసేన పోటీ చేస్తందని చేసిన కామెంట్లు కలకలం రేపాయి. వేర్వేరు సందర్బాల్లో నాయకులు చేసిన ప్రకటనల్లో సంచలన విషయాలను మాత్రమే ట్రోల్‌ చేయడం ద్వారా పార్టీ వర్గాలు గందరగోళానికి గురై ఇతర పార్టీలతో ఘర్షణకు దిగే పరిస్థితి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో అనవసర వివాదాలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చిందేపల్లిలో రహదారి పునరుద్ధరణ కోసం నిరాహారదీక్ష చేస్తున్న గ్రామస్థులు, జనసేన శ్రేణులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని పోరాటం చేస్తున్న వారిపై ఎస్సీఎస్టీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *