మక్కజొన్న రైతులకు తీపి కబురు

మక్కజొన్న రైతులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్‌. ఈ ఏడాది మక్కల కొనుగోళ్లకు సిద్ధమైంది. ఈ మేరకు యాసంగి మక్కల కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు చర్యలు చేపట్టారు.ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 6.50 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగైంది. ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు మక్కజొన్న సాగు చేశారు. దీని ప్రకారం 17.37 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఓవైపు అకాల వర్షాలతో పంట నష్టపోయి దుఃఖంలో ఉన్న రైతుకు మార్కెట్లో మక్కల ధర పడిపోవడం ఆవేదన మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.మక్కల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి నెలక్రితం మార్కెట్లో మక్కలకు భారీ డిమాండ్‌ ఏర్పడిరది. క్వింటాలుకు రూ.1,962 ధర ఉండగా.. మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ. 2,600 ధర పలికింది. కానీ ప్రస్తుతం భారీగా పడిపోయింది. మద్దతు ధర కన్నా తక్కువగా రూ.1,600 పలుకుతున్నది. ఓ వైపు వర్షాలతో నష్టం, మరోవైపు మక్కల ధర పడిపోవడంతో రైతులు పంటలను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మక్కల కొనుగోలు ద్వారా భారీ ఆర్థిక నష్టం ఏర్పడుతున్నా.. రైతుల మేలు కోసం ప్రభుత్వమే మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది మరోవైపు రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7100 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి కోతలు, ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక అకాల వర్షాలతో భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున ధాన్యం తడిసిన నేపథ్యంలో? కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *