వడ్డీల విూద వడ్డీలతో ఇబ్బందులు

గొర్రెల పథకం ప్రభుత్వానికి రోజురోజుకు భారంగా మారుతోంది. మొదటి విడత కోసం తీసుకున్న రూ.4వేల కోట్ల అప్పును తీర్చేందుకు వడ్డీలకే సగం ఖర్చు అవుతోంది. ఇందుకు సంబంధించి అసలు రూ.4వేల కోట్లకు గాను అందుకు వడ్డీనే రూ.1,281.81 కోట్లను ప్రభుత్వం ఎన్‌ సీడీసీకి చెల్లించింది. తెలంగాణ ఏర్పడిన తరువాత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ నుంచి రూ.4వేల కోట్లను అప్ప్పుగా తీసుకుంది. గొర్రెల పంపిణీతో ప్రభుత్వానికి రాబడి లేకపోవడంతో వడ్డీ భారం పెరిగిపోతుంది. ఇప్పటికే సర్కారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో గొర్రెల పథకానికి తీసుకున్న అప్పుకు చెల్లించే వడ్డీ మరింత భారంగా మారింది.2017లో రూ.4వేల కోట్ల అప్పుకు ఎన్‌ సీడీసీ వడ్డీ రేటును 9.57శాతం నుంచి 11.65 శాతంగా నిర్ణయించింది. తీసుకున్న ఏడాది నుంచి 2018 మే వరకు మారటోరియం ఉండడంతో అసలు కట్టకుండా కేవలం వడ్డీని మాత్రమే ఎన్‌ సీడీసీకి చెల్లించారు. అనంతరం 2018 నవంబర్‌ నుంచి అసలు, వడ్డీని కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తం రుణాన్ని 16 ఇన్‌ స్టాల్‌ మెంట్లలో తీర్చేందుకు ఎన్‌ సీడీసీ అవకాశం కల్పించింది. అందులో భాగంగా ఇప్పటివరకు 10 ఇన్‌ స్టాల్‌ మెంట్లలో అసలు రూ.2,030.89 కోట్లు, వడ్డీ రూ.1,281.81కోట్లు కలిపి మొత్తం రూ.3,312.71 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటివరకు అసలు లోని సగం అమౌంట్‌కే ఇప్పటివరకు రూ.1,281.81కోట్లను చెల్లించగా, మిగతా రూ. 2 వేల కోట్లకు సుమారు ఇంతే వడ్డీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం సమయానికి వడ్డీని కట్టకపోవడం వలన కూడా వడ్డీరేట్లలో మార్పులు జరుగుతున్నట్టు సమాచారం.మొదటి విడతలో తీసుకున్న అప్పును తీర్చేందుకే ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్న నేపథ్యంలోనే రెండో విడత గొర్రెల పంపిణీకి ఎన్‌ సీడీసీ రుణాన్ని మంజూరు చేసినా తీసుకునేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇందుకు ఈ పథకంతో ఎలాంటి ఆదాయం రాకపోగా వడ్డీ భారం ఎక్కువగా ఉండడమే కారణంగా కనబడుతోంది. ప్రస్తుతం రెండో విడతకు సంబంధించి మంజూరైన రుణాన్ని షీప్‌ ఫెడరేషన్‌ పొందాలంటే ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీని ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫైల్‌ సీఎం పేషీకి వెళ్లినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందులు, వడ్డీ భారం నేపథ్యంలో రెండో విడత లోన్‌ పై సందిగ్థత ఏర్పడిరది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *