కొత్త చిక్కుల్లో రిషి సునాక్.. జాంబీల ప్రభుత్వమంటూ తీవ్ర విమర్శలు

బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన కొత్తలో రిషి సునాక్‌కి అనుకూల వాతావరణం ఉండేది. కానీ.. క్రమంగా ప్రతికూల గాలులు వీస్తూ వస్తున్నాయి. రిషి ప్రభుత్వంపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఆయన వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు తారాస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా బ్రిటీష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ కూడా రిషి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన పార్లమెంట్ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తూ.. రిషి సునాక్‌కి వ్యతిరేకంగా ఒక భారీ లేఖనే రాశారు.

చాలాకాలం నుంచి రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఆమె.. ఇప్పుడు ఆ అసంతృప్తిని వెళ్లగక్కారు. రిషి సునాక్ జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. ఆయనకు రాజకీయ ముందుచూపు ఏమాత్రం లేదని నాడైన్ డోరీస్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిషి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన దేశ ప్రయోజనాల కంటే.. వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. సంప్రదాయవాదం యొక్క ప్రధాన సూత్రాలను రిషి పూర్తిగా పక్కనపెట్టేశారని, అతను బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాడని పేర్కొన్నారు.

మరోవైపు.. ప్రతిపాదిత భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్‌ కుటుంబం లబ్ధి పొందనుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒప్పందంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతుండగా.. రిషి భార్య అక్షితా మూర్తికి ఇన్ఫోసిస్‌లో 500 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ఉండటంపై బ్రిటన్‌ పార్లమెంటేరియన్లు, వాణిజ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా లేబర్‌ పార్టీకి చెందిన నేత డారెన్ జోన్స్ ప్రస్తావించారు. ప్రధాని రిషి భార్య అక్షితాకు ఇన్ఫోసిస్‌లో షేర్లు, ఆమెకు లభించే ప్రయోజనాలపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *