ఇట్లు…విూ విధేయుడు రాపాక…

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి పెళ్లి పత్రిక సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పత్రికపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కుమారుడి వివాహం జూన్‌ 7న రాత్రి ఒంటి గంటకు జరుగనుంది. శుభలేఖలపై ‘మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో..’ అంటూ అచ్చు వేయించారు. జనసేన ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి శుభలేఖపై వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ ఫోటోను ముద్రించడం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఈ శుభలేఖను షేర్‌ చేస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. స్వయంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఇతర నాయకులందరూ ఓటమి పాలైన వేళ.. రాపాక గెలుపు సంచలనంగా మారింది. రాజోలు నుంచి ఎన్నికైన రాపాక.. గెలిచిన తొలినాళ్లలో అధికార పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పారు. జనసేనలో ఉంటే తానే నంబర్‌ 1 అని, అదే వైఎస్సార్సీపీలోకి వెళ్తే.. తన నంబర్‌ 152 అవుతుందని తనదైన శైలిలో చెప్పి నవ్వులు పూయించారు. దీంతో జనసైనికులు ఫుల్‌ ఖుషీ అయ్యారు.అయితే, ఆ తర్వాత రాపాక తీరు మారింది. అధికార పార్టీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలు కుదిరినప్పుడల్లా జగన్‌ పట్ల విధేయత చాటుకున్నారు. అంతేకాదు.. 2020 డిసెంబర్లో తన కుమారుడు వెంకట్రామ్‌ను జగన్‌ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేర్పించారు.గతేడాది జూన్‌లో పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహించింది. ఈ ప్లీనరీకి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ హాజరయ్యారు. అంతేకాదు.. వైఎస్సార్సీపీ కండువా కప్పుకొని మరీ వేదికపై కూర్చున్నారు. అప్పట్లో ఇది చర్చనీయాంశం అయ్యింది. తనకు ఏ పార్టీతో పని లేదని.. ప్రజాసేవతోనే పని అని చెబుతున్న రాపాక.. వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *