పొలిటికల్ గురువులకు సవాల్‌ విసురుతున్న శిష్యులు.. నెగ్గేదెవరో..!?

ఒకనాడు జైకొట్టిన వారే నేడు ప్రత్యర్థులుగా మారారు. నేతలకు అనుచరులుగా మెలిగినవారు.. వారిపైనే పోటీకి దిగారు. గురువులా సన్నిహితంగా మెలిగి.. వారి బలాలు, బలహీనతలు తెలిసి.. వారికే కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో గురువులకు శిష్యులు సవాల్‌ విసురుతున్నారు. ఇలా సవాల్‌ ఎదుర్కొంటున్న వారిలో సీఎం కేసీఆర్‌ సహా పలువురు నేతలు ఉన్నారు. ఆయా చోట్ల పోటీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌కు కుడి భుజంలా ఉంటూ 2004 నుంచి 2018 వరకు టీఆర్‌ఎస్‌ తరపున అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌.. ప్రస్తుతం గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్‌పైనే బరిలోకి దిగారు.

టీఆర్‌ఎస్‌లో తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చిన ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగపెట్టి పంపించగా.. ఆయన బీజేపీలో చేరి 2022 ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చుక్కలు చూపించి, విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా సీఎం కేసీఆర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. ఇక సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న వట్టి జానయ్యయాదవ్‌ వాస్తవానికి మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడే. అయితే మంత్రి తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే కారణంతో బీఆర్‌ఎస్‌ను వీడి ఎన్నికల బరిలోకి దిగారు. నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో.. ఎన్నికల్లో జానయ్య ప్రభావం కచ్చితంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

నిరంజన్‌రెడ్డికి మేఘారెడ్డి చాలెంజ్‌..

వనపర్తి నియోజకవర్గంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ఒకప్పటి తన అనుచరుడి నుంచి సవాల్‌ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.మేఘారెడ్డి ఒకప్పుడు నిరంజన్‌రెడ్డి వెంట ఉన్నవారే. ఇప్పుడు ఆయనే ప్రధాన ప్రత్యర్థిగా మారి.. మంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మేఘారెడ్డి తన వెంట ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఆయనకు ఆదరణ రోజురోజుకూ పెరగడాన్ని గుర్తించిన నిరంజన్‌రెడ్డి.. ఈ పరిణామం భవిష్యత్తులో తనను ఇబ్బంది పెడుతుందని భావించి ఆయనను క్రమంగా దూరం పెడుతూ వచ్చారు. రూ.100 కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు జరగకుండా కొంతకాలంపాటు మంత్రి అడ్డుకున్నారని, మేఘారెడ్డి తిరుగుబాటుకు ఇదే కారణమనే ప్రచారం ఉంది. మేఘారెడ్డిని వనపర్తిలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా బరిలో నిలపడంతో ఒకప్పుడు నిరంజన్‌రెడ్డికి అనుచరులుగా పనిచేసిన వారంతా క్రమంగా మేఘారెడ్డికి చేరువయ్యారు.

ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో ఒకప్పటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. ఆ పార్టీ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు ప్రత్యర్థిగా సవాలు విసురుతున్నారు. వీరిద్దరూ 2018 ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేశారు. తరువాత వీరిమధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం హోరాహోరీగా తలపడే స్థాయికి చేరింది. కాగా, ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ మధ్య ఒకప్పుడు సన్నిహిత సంబంధాలే ఉండేవి. తుమ్మల మంత్రిగా ఉన్న సమయంలో అజయ్‌ ఆయనతో సన్నిహితంగా ఉంటూనే ప్రత్యామ్నా యంగా ఎదిగారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడం, అజయ్‌ గెలవడం, మంత్రివర్గంలో చోటు దక్కడంతో తుమ్మల వ్యతిరేక వర్గాన్ని చేరదీసి ఆయనకు ప్రత్యర్థిగా మారారు. తాజా ఎన్నికల్లో ఇద్దరూ ఖమ్మం నుంచి ఢీకొంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *