ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌

ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ వర్తింపజేసేందుకు సాధ్యాసాధ్యాలు తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. సచివాలయంలో గురువారం ఉదయం సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో దివ్యాంగుల రాష్ట్రస్థాయి సంక్షేమ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ ఒక రాష్ట్రం అభివృద్ధి ఒక శాఖకు సంబంధించిన అభివృద్ధిగా ఉండకూడదని, అన్ని శాఖలు సమర్ధవంతంగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. ప్రభుత్వ ఫలాలు అన్ని వర్గాలకు అందాలన్నదే తమ లక్ష్యమని, ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లబ్దిపొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ ఫలాలను అధికంగా ఎదురుచూసేది దివ్యాంగులేనని, వారి హక్కుల పరిరక్షణ, సమాజంలో అందరిలా వారు కూడా మెలగాలన్న దృక్పథంతో 2011లో దివ్యాంగుల సంక్షేమ కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రత్యేక బోర్డు ప్రారంభించారని గుర్తు చేశారు. డీఎంకే(DMK) అధికారం చేపట్టిన తరువాత దివ్యాంగులకిచ్చే ఆర్ధికసాయం రూ.1,000 నుంచి రూ.2 వేలకు పెంచామని, దీని ద్వారా 2,11,391 మంది లబ్దిపొందుతున్నారని తెలిపారు. దివ్యాంగులు ఒక సహాయకుడితో కలసి ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే సదుపాయంతో పాటు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దివ్యాంగులకు 5 శాతం ఇళ్లు, ఇంటి పట్టా అందజేయాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ప్రత్యేక పాఠశాలలు, ప్రాథమిక శిక్షణ కేంద్రాల్లో పనిచేస్తున్న 1,294 మంది ప్రత్యేక అధ్యాపకులు, వ్యాయామ టీచర్ల గౌరవ వేతనాన్ని రూ.14 వేల నుంచి రూ.18 వేలకు పెంచినట్లు తెలిపారు. చెన్నై నగరంలో దివ్యాంగుల కోసం రూ.1.50 కోట్లతో సంక్షేమ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటుచేశామని, దీని ద్వారా దివ్యాంగులు లబ్దిపొందవచ్చన్నారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధితో మెలగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందువల్లే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఇరైఅన్బు, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఆనంద్‌కుమార్‌, కమిషనర్‌ జెసింతా లాజరస్‌, ఎమ్మెల్యే ఏజీ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు

జాతీయ-అంతర్జాతీయ పోటీల్లో తమిళనాడు రాష్ట్రం తరఫున పాల్గొని పతకాలు సాధించిన 190 మంది క్రీడాకారులకు రూ.4.95 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందజేశారు. అన్నాసాలైలోని కలైవానర్‌ అరంగంలో గురువారం యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు సీఎం స్టాలిన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొలంబియాలో అండర్‌-20 కేటగిరీలో ప్రపంచ అథ్లెటిక్‌ పోటీలో ట్రిపుల్‌ జంప్‌లో రజత పతకం గెలుచుకున్న సెల్వప్రభు, రన్నింగ్‌ రజత పతక విజేత భరత్‌ శ్రీధర్‌లకు తలా రూ.4 లక్షల చెక్కులు అందజేశారు. ఇండోనేసియాలో జరిగిన ఆసియా కప్‌ గోల్ఫ్‌ పోటీలో కాంస్య పతకం గెలుచుకున్న తమిళనాడుకు చెందిన మారీశ్వరన్‌, కార్తీలకు తలా రూ.10 లక్షల చెక్కులు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *