ఇక ఏపీలో ముందస్తు నగారా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు డిసైడైపోయారా? ఆయన తాజా హస్తిన పర్యటనలో ఈ విషయంపై కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకు తార్కానంగా ఆయన హస్తిన నుంచే కేబినెట్‌ భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలను చెబుతున్నారు వచ్చే నెల 7న కేబినెట్‌ భేటీకి ఏర్పాట్లు చేయాలన్నదే ఆ సందేశం. ఆ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా జగన్‌ చెప్పారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన తీసుకోబోయే కీలక నిర్ణయం ముందస్తేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం దూకుడు ను నిలువరించాలంటే.. ఆ పార్టీ మరింత పుంజుకోకుండా ఆపాలంటే ముందస్తు ఒక్కటే మార్గమన్నది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఉద్దేశంగా వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాలలో వైసీపీ పాలన పట్ల.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్‌ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అందుకు తాజా తార్కానం అమరావతి ఆర్‌5 జోన్‌ లో పట్టాల పంపిణీకి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి.. వేల మందికి పట్టాలు పంపిణీ చేపట్టినా.. ఆ సభలో జగన్‌ ప్రసంగం ప్రారంభించగానే జనం మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడాన్ని చూపుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్‌ రోహిణి కార్తె ఎండలను మించిపోయింది. ఏపీ సీఎం ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేసినా ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ రావాల్సి ఉంది. అసెంబ్లీల గడువు పూర్తయ్యే రాష్ట్రాల్లో ఈసీ ఇప్పటికే సన్నాహాలు ఆరంభించింది. ధృవపడని సమాచారం మేరకు పనిలో పనిగా ఏపీలో కూడా ఈసీ ఎన్నికల సన్నాహాలు ఆరంభించింది. అయినా ఏపీలో కూడా ఎన్నికలు జరగాలంటే.. ఎ ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ఈసీ ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే? ఇక జాగు లేకుండా జగన్‌ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అదిగో ఆ నిర్ణయం తీసుకునేందుకే జగన్‌ వచ్చే నెల 7న కేబినెట్‌ బేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఆ విశ్లేషణలకు హేతువు మాత్రం ముఖ్యమంత్రి జగన్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల, మంత్రులు సమయం సందర్భంతో పని లేకుండా ముందస్తు ప్రశక్తే లేదన్న ప్రకటనలు గుప్పించడమేనంటున్నారు. ముందస్తుకు వైసీపీ తొందర ఎందుకంటే.. రాష్ట్రంలో జగన్‌ సర్కార్‌ సంక్షేమ పథకాల కొనసాగింపు పెద్ద క్వశ్చన్‌ మార్క్‌ గా మారింది. ఆర్థిక పరిస్థితులు కారణంగా ఆ పథకాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. అదే జరిగితే.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారి మొదటికే మోసం వస్తుంది. ఈ ఆలోచనతోనే జగన్‌ ముందస్తు మంత్రం జపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసిందనీ, సహకారం అందింస్తామన్న హావిూ కూడా జగన్‌ కు లభించిందని అంటున్నారు. అందుకే ఏళ్ల తరబడి పైసా విదల్చడానికి కూడా ఇష్టపడని కేంద్రం ఒక్క సారిగా ఉరుములేని పిడుగులా.. జగన్‌ సర్కార్‌ పై అవాజ్యమైన ప్రేమానురాగాలు ప్రదర్శిస్తూ రెవెన్యూ లోటు నిధులను పది వేల కోట్ల రూపాయలకు పై చిలుకు ఒకే సారి విడుదల చేసిందని అంటున్నారు.ముందస్తు సన్నాహాలకు, బకాయిల చెల్లింపులకు ఈ నిధులు రాష్ట్రానికి ఉపకరిస్తాయన్న యోచనతోనే ఆ విడుదల జరిగిందనీ, లేకుంటే గత ప్రభుత్వం రెవెన్యూలోటు భర్తీ గురించి అడినప్పుడల్లా దేశ రక్షణ నిధులివ్వమంటారా అంటూ ఒంటి కాలివిూద లేచిన కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇప్పుడు హఠాత్తుగా అంత సొమ్ము ఒకేసారి ఎందుకు విడుదల చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్‌ సర్కార్‌ ముందస్తుకు వెడుతుందా? లేదా? అన్నది జూన్‌ 7న జరిగే కేబినెట్‌ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *