టీడీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందం…

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం రాజకీయ అవసరాలు మాత్రమే రాజకీయాల్లో మిత్రులు, శత్రువులుగా ఎవరు ఉండాలో డిసైడ్‌ చేస్తుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు మిత్రులుగా ఉండి.. ఆ తరువాత శత్రువులుగా మారిపోయిన టీడీపీ, బీజేపీ.. ఆ తరువాత చాలాకాలం నుంచి దూరం దూరంగానే ఉంటున్నాయి. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢల్లీి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. దీంతో రాజకీయవర్గాల్లో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీలు మళ్లీ దగ్గర కాబోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన ఏపీలోని అధికార వైసీపీ.. చంద్రబాబు తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు సిద్ధమవుతున్నారని.. ఆ రకంగా ఏపీలో బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.అయితే ఇది సాధ్యపడకపోవచ్చని అన్నారు. కానీ వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత తెలంగాణలో బీజేపీకి టీడీపీ ఏ రకంగా సహకారం అందిస్తుందనే దానిపై చర్చ మొదలైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. టీడీపీ సహకారం లేకుండానే ఆ పార్టీ బలపడుతోంది. ఇంకా పలు జిల్లాలో ఏ రకంగా బలపడొచ్చనే అంశంపై వ్యూహరచన చేస్తోంది. అయితే తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్‌లోని ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బలం పుంజుకోవడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.అయితే ఈ ప్రాంతాల్లో టీడీపీ సహకారం లభిస్తే.. బీజేపీ బలపడే ప్రక్రియ చాలా సులువు అవుతుందని కమలనాథుల భావన. అందుకే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ సహకారం తీసుకుంటే బాగుంటుందన్నది ఆ పార్టీ యోచన. అయితే టీడీపీ సహకారం ప్రత్యక్షంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చంద్రబాబు, టీడీపీని బూచిగా చూపి మళ్లీ బీజేపీని టార్గెట్‌ చేసే అవకాశం ఉంటుందనే భావన బీజేపీ వర్గాల్లో ఉంది.తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకోవాల్సి వచ్చినా.. అది లోపాయికారిగా తీసుకోవాలే తప్ప.. నేరుగా ఆ పార్టీతో ఎలాంటి రాజకీయ పొత్తులు, సంబంధాలు పెట్టుకోకపోవడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. టీడీపీ సహకారం తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉండకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *