తెరపైకి లేపాక్షి భూములు వ్యవహారం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తండి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే భారీ అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్‌ సీఎం అయిన తరువాత మరింత రెచ్చిపోయారనడానికి ఇప్పుడు వెల్లువెత్తుతున్న ఆరోపణలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇసుక, మద్యం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న జగన్‌ ఒన్లీ క్యాష్‌ లావాదేవీలను కొనసాగించడమే ఆయన అవినీతి తిమింగలంలా మారారనడానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మంతా ఆన్‌ లైన్‌ లావాదేవీల వెంట పరుగులెడుతుంటే.. ఆఖరికి ఏపీ సర్కార్‌ బటన్‌ ద్వారా లబ్ధిదారులకు అందజేసే నగదు కూడా ఆన్‌ లైన్‌ ద్వారానే వెళుతుంటే ఒక్క మద్యం అమ్మకాలు మాత్రం క్యాష్‌ అండ్‌ క్యారీ పద్ధతిలో నిర్వహించడమే ఆ విధానంలో అవినీతి ఏరులై పారుతోందనడానికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే అనంతపురం లేపాక్షి భూముల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలు మరొక ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేర ఇందూ ప్రాజెక్ట్స్‌ కు ఎకరం 50 వేల రూపాయల చొప్పున వేల ఎకరాల కేటాయింపు జరిగింది. అయితే వాటిలో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు మాటే ఏత్తని ఇందూ ప్రాజెక్టులు ఆ భూములను తాకట్టు పెట్టి వేళ కోట్ల రూపాయల రుణాలను దండుకుంది. అలా దండుకున్న సొమ్ములో కొంత భాగం జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మరలాయని సీబీఐ అప్పట్లో నమోదు చేసిన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.ఈడీ కొన్ని ఆస్తులను కూడా అటాచ్‌ చేసింది. దీంతో ఇందూ ప్రాజెక్ట్‌ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకులు ఆ ప్రాజెక్టు దివాళా తీసిందని ప్రకటించేశాయి. దాంతో ఐదువందల కోట్ల రూపాయలకు ఇందు ఆస్తులను ఓ కంపెనీకి దారాదత్తం చేసేయడానికి బ్యాంకులు అంగీకరించేశాయి. అసలు బ్యాంకులు అందుకు ఎలా అంగీకరించాయో ఆర్థిక నిపుణులకు కూడా అర్ధం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసేసి చాలా కాలమైంది. ఆ భూములు ఇప్పుడు ఈడీ అధీనంలో ఉన్నాయి. అటువంటప్పుడు బ్యాంకులు ఆ భూములు తమ తనఖాలో ఉన్నాయంటూ.. ఏదో ఒక కంపెనీకి ఐదొందల కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పగించేయడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి. కేటాయింపులు రద్దు చేశామని నోటీసులు పెట్టాలి. అలా చేయడం లేదు. ఇందు ప్రాజెక్ట్స్‌ భూములపై రూ. ఐదు వేల కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు? దివాలా ప్రక్రియలో రూ. ఐదు వందల కోట్లిస్తే చాలని అంగీకరించడం వెనుక మతలబు ఏమిటి? అలా కాకుండా ఆ భూములను వేలం వేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది కదా? కానీ బ్యాంకులు వేలం వేయకుండా.. రూ. ఐదువందల కోట్లిస్తామని వచ్చిన కంపెనీకే కట్టబెట్టడానికి సిద్ధమైపోవడం వెనుక ఉన్న జగన్మాయ ఏమిటి? ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్‌ భూములను కొనుగోలు చేస్తున్న సంస్థలో జగన్‌ మేనమామ.. రవీంధ్రనాథ్‌ రెడ్డి కుమారుడు ఒక డైరక్టర్‌. ఈ కంపెనీకి డబ్బులు సమకూరుస్తోంది ఏపీలో పోర్టులు..సెజ్‌లు దక్కించుకున్న అరబిందో సంస్థ. సో భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ఎక్కడెక్కడ స్కామ్‌ లూ తిరిగి తిరిగి జగన్‌ అక్రమాస్తుల కుంభకోణం దగ్గరకే చేరుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఇందు ప్రాజెక్టు ఆస్తులను 500 కోట్ల రూపాయల అతి చౌక ధరకు అప్పనంగా తీసేసుకుంటున్న సంస్థ పేరు ఎర్తిన్‌ ప్రాజెక్టు. ఆ సంస్థ డైరెక్టర్‌ జగన్‌ మేనమామ కుమారుడు. ఎర్తిన్‌ కు నిధులు సమకూరుస్తున్నది ఏపీలో పోర్టులు సెజ్‌ లను దక్కించుకున్న అరబిందో సంస్థ. దీంతో ఈ డీల్‌ మొత్తం క్విడ్‌ ప్రొకొ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *