ఎమ్మెల్యేల్లో టెన్షన్‌… టెన్షన్‌

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ ఉంది. బీఆర్‌ఎస్‌ కు చెందిన చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమకు అధినేత కేసీఆర్‌ మరోసారి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక సర్వేలు సదరు ఎమ్మెల్యేలను టెన్షన్‌ పెడుతూ ఉన్నాయి. వారంతా ఊహించని విధంగా ఎప్పుడు ఎటువంటి ప్రకటన వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలకు పిలిచి మరీ వార్నింగ్‌ లు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. విూ తీరు మార్చుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ప్రజలతో మమేమకమై ఉండడమే కాకుండా.. కార్యకర్తలతోనూ, ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా టచ్‌ ఉండాలని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్‌ సూచనలు పాటించని నాయకులు త్వరలోనే షాకింగ్‌ న్యూస్‌ వినబోతూ ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. 119 సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కు 103 మంది సభ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 88 సీట్లు గెలుచుకోగా.. ఇతర పార్టీల నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ బలం 103కు చేరింది. సిట్టింగ్‌ ఎమ్మె ల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తామని పలు సందర్భాల్లో కేసీఆర్‌ ప్రకటించినా.. వారిలో కొందరిపై ఆయన ప్రత్యేకంగా నజర్‌ పెట్టారు. ఈ 103 మందిలో 46 మంది వరుసగా రెండు సార్లు, మరో 18 మంది మూడు కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారే ఉన్నారు. తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు నేతల తీరుపై పార్టీ ఇన్చార్జులు కేసీఆర్‌ కు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఆయా నేతల పనితీరుపై ఓ అంచనాకు వచ్చారు.పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్న సిటింగ్‌ ఎమ్మెల్యేలు, సర్వేల్లో బలహీనంగా ఉన్నవారి జాబితా కేసీఆర్‌ దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుంది. అందుకే ఆయన ఎప్పటికప్పుడు కొందరిని అలర్ట్‌ చేస్తూ ఉంటారు.. కేసీఆర్‌ మాటలు విన్న చాలా మంది బాగుపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కొందరు చేజేతులా అవకాశాలను పాడుచేసుకున్నారనుకోండి. ఇక 2018 ఎన్నికల్లో ఏడుగురు సిటింగ్‌లకు మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులు ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలను ఇటీవల కాలంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కేసీఆర్‌ పరోక్షంగా హెచ్చరించారు. తీర్చు మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కడం కష్టమేనని అంటున్నారు. ఆ లిస్టులో ఉన్న పలువురు నేతల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *