అంబేడ్కర్‌ గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి?

ఇటీవల అమెరికాలోని కొలరాడో, మిషిగన్ రాష్ట్రాలు ఏప్రిల్ 14ను ‘డా. బీఆర్ అంబేడ్కర్ ఈక్విటీ (సమన్యాయం) డే’గా ప్రకటించాయి. అంతకు ముందు, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ కూడా ఏప్రిల్‌ను దళిత్ హిస్టరీ మంత్ (దళితుల చరిత్ర మాసం)గా ప్రకటించింది.

భారత రాజ్యాంగ మూలకర్త అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన దళితులు, అణగారిన వర్గాల గౌరవం, హక్కుల కోసం కృషి చేశారన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన కృషి ఫలితంగా భారతదేశంలో అట్టడుగు వర్గాలవారికి రిజర్వేషన్లు, వివక్ష వ్యతిరేక చట్టాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు దళిత ఉద్యమకారులు, విద్యావేత్తలు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారు పశ్చిమ దేశాల్లో కూడా దళితుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.

విదేశాలకూ విస్తరించిన కుల జాడ్యం

సాధారణంగా విదేశాల్లో భారతీయులకు “మోడల్ మైనారిటీలుగా” పేరుంది. ఏ దేశానికి వెళ్లినా సజావుగా, ఉత్సాహంగా అక్కడి ప్రజలతో కలిసిపోతారన్న కీర్తి ఉంది. కానీ, అక్కడ కూడా భారతీయుల మధ్య కుల వివక్ష విలసిల్లుతూనే ఉంది.

“ఒకసారి అంబేడ్కర్ ఏమన్నారంటే, ‘హిందువులు వేరే దేశానికి వలస వెళితే, భారతీయుల కులం సమస్య ప్రపంచ సమస్యగా మారిపోతుంది.’ ఇప్పుడు అమెరికాలో సరిగ్గా అదే జరుగుతోంది” అని అమెరికాలోని పౌర హక్కుల సంఘం ‘అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌’కు చెందిన రామకృష్ణ భూపతి బీబీసీతో అన్నారు.

విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థల్లో అగ్రవర్ణ భారతీయులు చూపిస్తున్న వివక్ష బయటకు రావట్లేదని, దానిపై ఎవరూ దృష్టి పెట్టట్లేదని దళిత ఉద్యమకారులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.

అయితే, గత కొన్నేళ్లల్లో ఈ రకమైన వివక్ష గురించి కూడా మాట్లాడడం పెరిగింది.

2020 సెప్టెంబర్‌లో ఎన్‌పీఆర్ నిర్వహించే రఫ్ ట్రాన్స్‌లేషన్ షోలో ఒక టెక్ ఉద్యోగి సామ్ కార్నెలియస్ అనే మారుపేరుతో ఇలాంటి వివక్ష గురించి మాట్లాడారు. తాను జంధ్యం వేసుకున్నానో లేదో పరిశీలించడానికి సహోద్యోగులు వీపు మీద తడుతూ మాట్లాడతారని చెప్పారు. జంధ్యం సాధారణంగా బ్రాహ్మణులు వేసుకుంటారు.

“స్విమ్మింగ్ చేద్దాం రమ్మని పిలుస్తారు. ‘హేయ్ ఈత కొడదాం రా’ అంటారు. ఎందుకంటే, ఈత కొట్టడానికి చొక్కా తీసేయాలి కదా. అప్పుడు ఎవరెవరు జంధ్యాలు వేసుకున్నారో సులువుగా తెలిసిపోతుంది” అని ఆయన ఆ షోలో చెప్పారు.

అదే విధంగా, యూనివర్సిటీల్లో జరిగే పార్టీల్లో భారతీయులు ఒకరినొకరు కులాలు అడిగి తెలుసుకుంటారని చెబుతూ మరికొందరు భయన్ని, అసౌకర్యాన్ని వ్యక్తం చేశారు.

అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఉద్యమకారుల కృషి, ఆన్‌లైన్, సోషల్ మీడియా కొంతవరకు “సురక్షితమైన” వేదికగా మారడం వలన ఈమధ్య కాలంలో ఇలాంటి కులవివక్షలు ఎక్కువగా వెలుగులోకొస్తున్నాయి.

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్, బ్రయోన్నా టేలర్ హత్యల తరువాత బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావం కూడా కొంత ఉందని మైనేలోని కోల్బీ కాలేజీలో రిజర్వేషన్ల కోసం పోరాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సోంజా థామస్ అన్నారు.

తమ సొంత కమ్యూనిటీలలో నల్లజాతీయుల పట్ల వివక్షను, కులవివక్ష ద్వారా వివరించేందుకు దక్షిణాసియా అమెరికన్లు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.

గత దశాబ్దకాలంలో అగ్రవర్ణాలలో కూడా ప్రధానంగా మార్పు వచ్చిందని, చారిత్రకంగా తమకు లభించిన కులాధిపత్యం సమస్యలతో పెనుగులాడుతున్నారని సోంజా థామస్ అన్నారు.

“మా ముందుతరాల వాళ్లు ఒక చిన్న సూట్ కేసు, జేబులో కొన్ని డాలర్లతో ఇక్కడకు ఎలా చేరారో, ఎంత కష్టపడ్డారో కథలుగా విన్నాం. అయితే, తరాలుగా భారతదేశంలో పాతుకుపోయిన కులాధిపత్యం వాళ్లు ఇక్కడకు రావడానికి మార్గం వేసిందని, వారు, వారి పిల్లలు ఇక్కడ రాణించడానికి దోహదపడిందన్న అవగాహన మాత్రం ఎవరికీ లేదు” అని డాక్యుమెంటరీ చిత్రనిర్మాత కవితా పిళ్ళై అన్నారు. పులిట్జర్ సెంటర్ నిధులు సమకూర్చిన ‘కాస్ట్ ఇన్ అమెరికా సిరీస్‌’లో కవితా ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *