కొడాలి నాని మౌనం ఎందుకో

కొడాలి నాని తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. జగన్‌ తొలి కేబినెట్‌ లో మంత్రిగా పని చేసిన ఆయన తనకు మాత్రమే ప్రత్యేకమైన బూతుల మంత్రి అని బిరుదు కూడా పొందారు. మంత్రిగా ఆయన చేసే వ్యాఖ్యలు, విమర్శలు విలువలకు వలువలు ఒలిచేసినట్లుగా ఉండేవి. ముఖ్యంగా అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పై అనుచిత విమర్శలు చేసి వార్తల్లో నిలిచేవారు.ఆయన మాట్లాడే భాష ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేకపోయినా.. దానినే వాడుతూ ఒక విధంగా నెగటివ్‌ పాపులారిటీ విపరీతంగా పొందారు. అదే సమయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలను సీఎం జగన్‌ ఏ మాత్రం ఖండిరచకపోవడం, పైపెచ్చు ముసిముసి నవ్వులతో ప్రోత్సహించడంతో నాని ఇంకా రెచ్చిపోయేవారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా.. బూతుల మంత్రిగా జగన్‌ తొలి కేబినెట్‌ లో ఓ వెలుగు వెలిగిన కొడాలి నానికి చిత్రంగా మలి కేబినెట్‌ లో స్థానం లేకుండా పోయింది. పునర్వ్యవస్థీకరణలో నాని మంత్రి పదవి ఊడిరది. ఆ సమయంలో ఆయన ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. నోటికి తాళం వేసుకుని ఓ పశువుల పాకలో పడుకున్న ఫొటోలు అప్పట్లో తెగ వైరల్‌ అయ్యాయి కూడా. సరే కొంత కాలం మౌన మునిలా మారిపోయిన కొడాలి నాని ఆ తరువాత మళ్లీ తన నోటికి పని చెప్పడం ప్రారంభించారు. అది వేరే సంగతి. మధ్యలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కాసినో నిర్వహించారంటూ పెద్ద ఎత్తున విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నాని మరోసారి నోటికి తాళం వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడికక్కడ చార్జిషీట్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గుడివాడలో బీజేపీ చార్జ్‌ షీట్‌ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ నానిపై, నాని భాషపై, ఆయన కాసినో వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకే అడుగు పెట్టనీయకూడదని అన్నారు. అంతే కాకుండా ఇటువంటి నేతలను తమ పార్టీ అధికారంలోకి వస్తే జైల్లో పెట్టిస్తామన్నారు. సరే.. సునీల్‌ దియోధర్‌ విమర్శించినది అలాంటిలాంటి నేతను కాదు.. నోరు విప్పితే బూతులు, దుర్భాషలు వినా మరొకటి రాని కొడాలి నానిని. మరి నాని ఊరుకుంటారా? తన నోటికి పదును పెట్టారు. సునీల్‌ దియోదర్‌ ని పకోడీగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన లాంటి నాయకుల వల్లే కర్నాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. దీంతో బీజేపీ మండి పడిరది. సాధారణంగా నానిని విమర్శించడానికి కానీ, ఆయన విమర్శలకు స్పందించడానికి కానీ ఎవరూ పెద్దగా ఇష్టపడరు. బురదలో రాయి వేయడం ఎందుకని మిన్నకుంటారు. కానీ బీజేపీ అలా ఊరుకోలేదు. తీవ్రంగా స్పందించింది. సవాళ్లు విసిరింది. నాని వాచాలతకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్లుగా ఎదురుదాడికి దిగింది. గుడివాడలో అభివృద్ధి, వైసీపీ పాలనపై బహిరంగ చర్చకు సవాల్‌ విసిరింది. ఇందుకు గన్నవరం బస్టాండ్‌ ను వేదికగా నిర్ణయించింది. మామూలుగా అయినే నాని ఇలాంటి సవాళ్లకు వెంటనే స్పందిస్తారు, సై అంటారు. కానీ బీజేపీ సవాల్‌ కు మాత్రం నాని నుంచి ఎటువంటి స్పందనా లేదు. నోటికి తాళం వేసుకున్నట్లు కూర్చున్నారు.వైసీపీ అధిష్ఠానం నోరు నొక్కేసిందో.. లేక బీజేపీతో శతృత్వం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారో కానీ నాని మౌనమునిగా మారిపోయారు. అయితే బీజేపీ మాత్రం నానిని వదలడం లేదు. సవాళ్ల విూద సవాళ్లు విసురుతోంది. నోరెత్తితే ఊరుకోమన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయిన దానికీ కాని దానికీ బూతులతో విరుచుకుపడే నాని మౌనం వెనుక జగన్‌ హెచ్చరిక, మందలింపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి కోపం వస్తే.. జగన్‌ పుట్టి మునుగుతుందన్న భయంతోనే వైసీపీ అధిష్ఠానం నాని నోటికి తాళం వేసిందంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *