నడక దారిలో భక్తులకు కర్రలు

తిరుపతి, ఆగస్టు 18
తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది మన తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచ నలుమూలల నుండి కలియుగ దైవం వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తజన కోటిని ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో టీటీడీ నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని అంతా దుమ్మెత్తి పోశారు. విపక్షాలైతే.. అసలు తిరుపతి అడవిలో ఏం జరుగుతుంది.. ప్రశాంతంగా అడవిలో బతికే మృగాలు తిరుమల భక్తులపైకి ఎందుకొస్తున్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో టీటీడీ ఏదో ఒకటి చేసి విమర్శల నుంచి, ప్రశ్నల నుంచి బయటపడాలని భావించింది. చిరుతలను బంధించాలని ఆదేశించింది. దాడి చేసిన చిరుతను దృష్టిలో పెట్టుకొని ఇందుకోసం ఆపరేషన్‌ చిరుత స్టార్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ చిరుతల వేటలో వంద మంది అటవీ సిబ్బంది పాల్గొనగా.. తిరుమలలో ఆపరేషన్‌ చిరుత ముమ్మరంగా సాగుతోంది. గురువారం బోనులో మరో చిరుత చిక్కగా ఇంకా 3 నుంచి 4 చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ముందుగా చిన్నారిపై చిరుత దాడి ఘటన వెలుగులోకి రాగానే టీటీడీ ఆఘమేఘాల విూద ఏవేవో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. అవన్నీ కఠిన నిర్ణయాలని చెప్పుకొచ్చింది. వాటిని శరవేగంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఏదేదో కఠిన నిర్ణయాలని చెప్పి నడక మార్గంలో తిరుమలకి వెళ్లే భక్తులకు ఊత కర్రలను సిద్ధం చేసింది. కాలినడక మార్గంలో వన్యప్రాణుల సంచారం అధికమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచింది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి ఒక్కో చేతి కర్రను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ వాలంటీర్లు, సిబ్బంది ద్వారా వీటిని సరఫరా చేస్తున్నారు. చిరుత దాడితో టీటీడీ కఠిన నిర్ణయాలు అంటే వెంకన్న భక్తులు ఏదేదో ఊహించుకున్నారు. కానీ చివరికి చేతికి ఊత కర్ర ఇవ్వడంతో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. టీటీడీ నిర్ణయంపై సోషల్‌ విూడియాలో కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కర్రలతో పులులు, సింహాలను వేటాడాలా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భద్రత అంటే కర్రలు ఇవ్వడం కాదు.. రక్షణ గోడలు బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీటీడీ ప్రకటించిన ఊత కర్ర సోషల్‌ విూడియాలో అతి పెద్ద ట్రోలింగ్‌ గా మారింది. నిత్యం వెంకన్న కోసం లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాంటిది ఒక మనిషికి ఓ కర్ర సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఈ కర్ర సిద్ధాంతం అమలు చేయాలంటే కొన్ని వేల కర్రలు కావాలి. అది కూడా కొండపైకి పంపించే కర్రలను కొండవిూద కలెక్ట్‌ చేసుకోని మళ్ళీ తిరిగి కొండ దిగువకి తేవాలి. కనీసం ఇలా చేయాలన్నా కొన్ని ఎకరాల్లో అడవిని నాశనం చేయాలి. ఇందు కోసం మరింత సిబ్బంది కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కర్ర విూద సామే. సోషల్‌ విూడియాలో ఈ నిర్ణయం పై రకరకాల సెటైర్లు పడుతున్నాయి. అయితే, సోషల్‌ విూడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ పాలకవర్గం, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భక్తులకు కర్రలు కాకుండా తుపాకులు ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి. మొత్తానికైతే టీటీడీ ఊతకర్రల నిర్ణయం సోషల్‌ విూడియాని షేక్‌ చేస్తోంది. తిరుమల అంటే హిందువులకు ఒక నమ్మకం. కొండ ఎక్కితే ఆయనే తన మోర ఆలకించి ఆదుకుంటాడని ఒక ధీమా. కానీ ఇప్పుడు తిరుమలలో అదే కొరవడిరది. ఏడుకొండలవాడి కోసం నడకమార్గంలో వచ్చే భక్తులకు భద్రంగా తిరుమల చేరుకుని వెంకన్న దేవుడి దర్శనం చేసుకుంటామా అన్న నమ్మకం లేకుండా పోయింది. ఎప్పుడు ఏమవుతుందో, ఏ మృగం తమపై దాడి చేస్తుందోనని కొండెక్కే ప్రతి భక్తుడు భయం భయంగా అడుగులేసే పరిస్థితి వచ్చింది. దీంతో భక్తులు ఏడుకొండలవాడా వెంకటేశ.. అయ్యో ఇదేం దుస్థితయ్యా నీ భక్తులకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *