తెలంగాణలో సంకీర్ణమా…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సవిూపిస్తున్నాయి. మరో ఐదారు నెలల్లో, అంటే సంవత్సరాంతానికి ఎన్నికల క్రతువు ముగుస్తుంది.2024 ప్రారంభం నాటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే కొత్త సంవత్సరంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఎవరవుతారు? ముచ్చటగా మూడవసారి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక ఇప్పటికే డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ‘వారసుడు’ కేటీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారా? అంటే బీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిస్తే, కేటీఆర్‌, అత్తెసరు మెజారిటీతో గెలిచినా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినా మళ్ళీ కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని, పార్టీ కీలక నేతలు కొందరు పిచ్చాపాటి చర్చల్లో పేర్కొంటున్నారు. రేపటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు స్పష్టమైన వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే,బీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలుస్తుందని,అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని పార్టీ లోపలా బయటా కూడా చర్చ జరుగుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్సార్‌ క్యాబినెట్‌ లో తెరాస మంత్రి పదవులు పుచ్చుకున్న విధంగా రేపు కేసేఆర్‌ సర్కార్‌ లో కాంగ్రెస్‌ మంత్రి పదవులు పుచ్చుకోవచ్చని ఇటు బీఆర్‌ఎస్‌ వర్గాలు, అటు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ప్రత్యక్ష పొత్తు కుదిరినా ఆశ్చర్య పోనవసరం లేదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అంటున్నారు. నిజానికి, జాతీయ స్థాయిలో బీజేపీని ఓడిరచాలనే సంకల్పం విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పెద్దగా తేడాలేదు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు రెండూ బీజేపీని బూచిగా కాదు, భూతంగా చూస్తున్నాయి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనగడ మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందనే భయం ప్రాంతీయ పార్టీలను వెంటాడుతోంది. అందుకే నిన్నమొన్నటివరకు కాంగ్రెస్‌ పార్టీ స్నేహ హస్తం అందుకునేందుకు ససేమిరా అన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ (ఆప్‌), కర్ణాటక ఫలితాల తర్వాత ఇప్పుడు హస్తం పార్టీతో సహపంక్తి భోజనానికి సిద్దమంటున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం కాంగ్రెస్‌ తో చేతులు కలిపేందుకు సిద్దమే కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో వేచిచూసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్‌ లో కూడా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వంటి కొద్ది మంది నేతలు తప్పించి కాంగ్రెస్‌ సీనియర్లు చాలా వరకు బీఆర్‌ఎస్‌ తో పొత్తుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో జరగరానిది జరిగి కాంగ్రెస్‌ పార్టీకి 80 కి పైగా సీట్లు వస్తే సరే లేదంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేమని గోదా గోడ దూకే ఎమ్మెల్యేలను అపలేమని స్వయంగా పీసీసీ చీఫ్‌ పేర్కొన్నారు. అంతే కాకుండా గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ పై గెలిచిన ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 బీఆర్‌ఎస్‌ లోకి జంప్‌ చేశారు. ఈసారి హస్తం గుర్తుపై గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య 29దో.. 39దో అయినా మళ్ళీ అదే జరుగుతుందని స్వయంగా పీసీసీ చీఫ్‌ స్పష్టం చేస్తున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకటడడం, తెలంగాణలో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *