యూ టర్న్‌ తీసుకున్న మాజీ మంత్రి

హైదరాబాద్‌, జూన్‌ 27 :
మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ చేరుతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ వ్యూహాలతో బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తుంటే… కీలక నేతల చేరికలతో కాంగ్రెస్‌ యాక్టివ్‌ అయింది. బీఆర్‌ఎస్‌ లో టికెట్లు దక్కవనే ఉద్దేశంతో కొందరు నేతలు కాంగ్రెస్‌ లోకి టచ్‌ లోకి వెళ్తున్నారని సమాచారం. మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ తలుపు తట్టారని తెలుస్తోంది. అయితే ప్రగతి భవన్‌ నుంచి పిలుపుతో ఆయన అభిప్రాయం మార్చుకున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్‌ రెడ్డి… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున తాండూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్‌ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తాండూర్‌ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మళ్లీ ఆయనకే టికెట్‌ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే పట్నం మహేందర్‌ రెడ్డికి ఛాన్స్‌ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో మహేందర్‌ రెడ్డి పార్టీ మారేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.అయితే మహేందర్‌ రెడ్డి తనతో పాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల కేటాయింపుపైన కాంగ్రెస్‌ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కొందరి సీట్లు ఖరారు అయ్యాయని ఒక జాబితా బయటకు వచ్చింది. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ కు జహీరాబాద్‌, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్‌ రత్నంకు చేవెళ్ల, తాండూరు నుంచి మహేందర్‌ రెడ్డికి ఇవ్వాలని..మహేందర్‌ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్‌ సభ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం ప్రగతి భవన్‌ కు లీకవ్వడంతో మహేందర్‌ రెడ్డికి ఫోన్‌ వచ్చినట్లు సమాచారం. అనంతరం ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారని తెలుస్తోంది. అయితే మహేందర్‌ రెడ్డి అనుచరులు మాత్రం హస్తం పార్టీ వేపు చూస్తున్నారని టాక్‌ నడుస్తోంది.తాండూర్‌ నియోజకవర్గంలో ఈసారి కూడా పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సీటు ఖాయమని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి మహేందర్‌ రెడ్డికి ఏదైనా హావిూ వచ్చిందా? అని అనుచరుల్లో చర్చ జరుగుతోంది. పార్టీ మార్పుపై సంకేతాలు ఇచ్చి ఇప్పుడు సడెన్‌ గా సీన్‌ రివర్స్‌ చేశారని అంటున్నారు. అయితే మహేందర్‌ రెడ్డి అనుచరుల్లో కొందరు మాత్రం కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ లో టికెట్లు రాకపోతే తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారడం తప్పనిసరి అని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల సవిూపిస్తుండడంతో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అనుచరుల ప్రయత్నాలు మహేందర్‌ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఇప్పుడు వారిని కూల్‌ చేసేందుకు మహేందర్‌ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *