రాజాసింగ్‌ పై బీజేపీ మౌనం… దేనికి సంకేతం

హాస్య నటుడు మునావర్‌ ఫారూఖీ హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన షో సందర్భంగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో చర్చలకు కారణమై బీజేపీ నుండి బహిష్కరణకు గురైన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సొంత పార్టీ నాయకులే పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా తీవ్ర దుమారం చెలరేగింది. పాతబస్తీలో అల్లర్లకు ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపారు. అయితే 2018లో శాసనసభకు జరిగిన ఎన్నికలలో బీజేపీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌.కాగా అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో రఘునందన్‌ రావు, ఈటెల రాజేందర్‌లు పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో అసెంబ్లీలో మొత్తం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరగా ప్రస్తుతం రాజాసింగ్‌ బహిష్కరణకు గురయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుండి కొన్ని రోజుల వరకు ప్రాతినిథ్యం వహించి శాసనసభా పక్ష నేతగా ఉన్న రాజాసింగ్‌ను పార్టీ నుండి బహిష్కరించినప్పటికీ అటు పార్టీలో, ఇటు సొంత నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం గమనార్హం. రాష్ట్రంలో బీజేపీకి అంతగా ఫాలోయింగ్‌ లేని సమయంలో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ప్రస్తుతం గడ్డుకాలం ఎదొర్కుంటుండగా.. రాజాసింగ్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీ అగ్రనాయకులు పేర్కొంటున్నారు.బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపించినప్పటికీ సొంత పార్టీ నేతలు ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు. ఆయనకు మద్ధతుగా నిలిచే వారు లేకుండా పోయారు. ఉప ఎన్నికలలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచేంత వరకు రాష్ట్ర బీజేపీ నుండి ఆయన ఒక్కరే ఎమ్మెల్యే. హిందూ ధర్మం గురించి నిత్యం ఆయన వీడియోలు రికార్డు చేసి సోషల్‌ విూడియాలో పోస్టు చేసేవారు. ఆయనకు తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.ఇప్పుడదంతా ఏమైందనేది ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేస్తే కనీసం సొంత పార్టీ నేతలు కూడా నోరు మెదపకపోవడం చూస్తోంటే ఆయనను పార్టీ వదులుకోవాలని చూస్తోందనేది వారి వాదన. ఇటీవల రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కేవలం పదుల సంఖ్యలో గోషామహల్‌ నియోజకవర్గంలో ఆందోళనలు నిర్వహించారు. అనంతరం వారు కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ చరిష్మా తగ్గిందా ? లేక ఆయనకు చెక్‌ పెట్టేందుకే చూస్తున్నారా ? అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు .ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదై జైలులో ఉంటే ఆయనకు కార్పొరేటర్ల రూపంలో సొంత నియోజకవర్గంలో కుంపటి తయారైందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఆరు డివిజన్లు ఉన్న గోషామహల్‌ నియోజకవర్గంలో గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఐదు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు, ఒక్క డివిజన్‌లో ఎంఐఎం కార్పొరేటర్‌ విజయం సాధించారు. అయితే ఇటీవల పార్టీ నుండి బహిష్కరణకు గురైన రాజాసింగ్‌కు సంఫీుభావం ప్రకటించేందుకు బదులుగా.. నియోజకవర్గంలోని బీజేపీ కార్పొరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని వారి అనుచరుల వద్ద సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్యే జైలు పాలైన సమయంలో వారు ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకుంటున్న వారిలో ఇద్దరు కార్పొరేటర్లు మొదటి సారిగా గ్రేటర్‌ ఎన్నికలలో విజయం సాధించిన వారే కావడంతో నియోజకవర్గం ప్రజలు వీరి వ్యాఖ్యలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తం విూద హిందూ ధర్మం పేరుతో నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్‌ పార్టీకి మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ ఆయనను పార్టీలో తిరిగి చేర్చుకోకుండా రాబోయే ఎన్నికలలో తమకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్న కార్పొరేటర్ల కోరికను అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *