హ్యాట్రిక్‌ సీట్లపై గురి

విజయవాడ, జూలై 4
తెలుగుదేశం పార్టీ వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించిన అసెంబ్లీ నియోజక వర్గాలు ఏపీలో ఏడు మాత్రమే ఉన్నాయి. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలిచిన స్థానాలను 2024లో కూడా దక్కించుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2009 నాటి నుంచి ఏపీలో టీడీపీ వరుసగా గెలుస్తున్న స్థానాలు ఏడు మాత్రమే ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన 2019లో ఓటమి తప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనుకునే స్థానాల్లో 2024 ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ సర్వత్రా ఉంది.టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందనే భరోసా ఉన్న స్థానాలను ఈ సారి కూడా దక్కించుకుంటుందా అనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతోంది. ఇచ్చాపురం, విశాఖపట్నం తూర్పు, మండపేట, రాజమండ్రి రూరల్‌, గన్నవరం, హిందూపురం, కుప్పంలలో మాత్రమే వరుసగా టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ ఏడు స్థానాల్లో గన్నవరం అభ్యర్థి ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. దీంతో ఆ స్థానాన్ని టీడీపీ మళ్లీ దక్కించుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.ఇచ్చాపురంలో 2009లో? పిరియ సాయిరాజ్‌ గెలిచారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బెందాళం అశోక్‌ విజయం సాధించారు. విశాఖపట్నం తూర్పులో 2009 నుంచి వరుసగా వెలగపూడి రామకృష్ణబాబు గెలుస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 2009 నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మండపేటలో వైసీపీ సీనియర్‌ నాయకుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను జోగేశ్వరరావు ఓడిరచారు.రాజమండ్రి రూరల్‌ నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెండుసార్లు విజయం సాధించారు. 2014,2019లో గోరంట్ల టీడీపీ తరపున గెలిచారు. 2009లో చందన రమేష్‌ టీడీపీ తరపున విజయం సాధించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో 2009 నుంచి వరుసగా టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 2014,2019లో టీడీపున పోటీ చేసిన వల్లభనేని వంశీ విజయం సాధించారు. 2009లో దాసరి బాలవర్ధనరావు ఇక్కడి నుంచి గెలిచారు.ఇక టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజక వర్గాల్లో ఒకటైన హిందూపురంలో 1983 నుంచి ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టీడీపీ అభ్యర్ధులు గెలుస్తూనే ఉన్నారు. 2014,19 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో 16,186 ఓట్ల మెజార్టీతో గెలిస్తే 2019లో బాలకృష్ణ 17వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై గెలిచారు.టీడీపీ గెలుపు ఖాయం అనుకునే స్థానాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే కుప్పం కూడా ఉంది. 1983 నుంచి కుప్పంలో వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. 1983, 85 ఎన్నికల్లో కుప్పంలో రంగస్వామి నాయుడు గెలుపొందారు. 1989 నుంచి 2019 వరకు ఏడు సార్లు కుప్పంలో చంద్రబాబు విజయం సాధించారు.2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ 23స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మరోవైపు 2009 నుంచి వరుసగా గెలిచిన స్థానాల సంఖ్య ఏడుకు మాత్రమే పరిమితం అయ్యింది. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావిస్తున్న తెలుగుదేశం తమకు పట్టున్న స్థానాల్లో బలం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఎన్నికలకు మరో 9నెలలు మాత్రమే గడువు ఉండటంతో అన్ని నియోజక వర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమించడంతో స్పీడ్‌ పెంచింది. టీడీపీ హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఏడు స్థానాల్లో ఎన్నింటిని మళ్లీ పదిలం చేసుకుంటుందనేది చర్చగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *