ఒంటరి మహిళల పిల్లలందరూ దేశం సుపుత్రులే!

చాలా కాలం క్రితం ఒక మహిళ తన కుమార్తెను స్కూల్లో చేర్చాలని తీసికెళ్లింది. ఇద్దరే బిక్కు బిక్కుమంటూ రావడంతో అక్కడున్న వారు వీలయినంత అనుమానించారు. ఆ చూపులతోనే వేల ప్రశ్నలు వేశారు. ఇదే పరిస్థితి లోపల కూడా ఉంటుందని ఆమె అనుకుంది. ప్రిన్సిపల్‌ పిలవగానే లోపలికి వెళ్లారు. పిల్ల టెన్త్‌లో చేరాలి, మేము వేరే గ్రామం నుంచి వచ్చామన్నదామె. అన్ని ప్రశ్నలు అయ్యాక ఏదో ఒక ఫామ్‌ తీసి పూర్తిచేయమన్నారు. అందులో తండ్రిపేరు దగ్గర ఆమె ఆగిపోయింది. క్లర్కు ఆమెనే అనుమానించాడు. ఆమె అతని పేరు రాయడానికి నిరాకరించింది. తండ్రిపేరు తప్పకుండా రాయాలని క్లర్కు పట్టుపట్టాడు. ఆ స్కూలు యాజమాన్యం ఒత్తిడి చేసింది. ఆమె నిరాకరించింది. అవమానకరంగా భావించి పిల్లని తీసుకుని వెళిపోయింది. వేరే స్కూల్లో చేర్చి బాగా చదివించుకుంది. ఇక్కడ ప్రశ్నల్లా తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాలన్న నిబంధన. కాలం మారినా తండ్రి పేరు విషయంలో నిబంధనలు మారలేదు. ఇపుడు ఇదే అంశం విూద కేరళ హైకోర్టు అత్యంత కీలక తీర్పు ఇచ్చింది. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు తప్పని సరి కాదు తల్లి పేరును మాత్రమే ఉన్నా చాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. అత్యాచారాలకు గురయిన మహిళలు,విడాకులు తీసుకుని భర్తకు దూరంగా బతుకుతూ పిల్లల్ని పోషిం చుకుంటున్న సింగిల్‌ మదర్‌ పట్ల సమాజం వ్యవహరించే తీరు మారాలన్నదే కోర్టు తీర్పు సారాంశం. కేరళ హైకోర్టు జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ మహాభారతంలో కర్ణుడి ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. అత్యంత కీలక వ్యాఖ్య లు చేశారు. ఇకపై ఎవ్వరు కర్ణుడిలా బాధపడాల్సిన అవసరం లేదనీ, అవమానాలు భరించాల్సిన పనిలేదన్నారు. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును పేర్కొనకుండా కేవలం తల్లి పేరును మాత్రమే వెల్లడిరచే హక్కు ప్రతి అమ్మకూ ఉంటుందని స్పష్టం చేసారు. సమాజంలో అవివాహిత మహిళలు, అత్యాచార బాధితుల పిల్లలకు ఎదురవుతున్న బాధలను గుర్తిస్తూ ఈ తీర్పును వెలువరించింది.ఇంకా కోర్టు పలు వ్యాఖ్యలు సింది. తండ్రి ఎవరో తెలియనందుకు జీవితాంతం దూషణలకు గురైన మహాభారతంలోని కర్ణుడి లాంటివారు మన సమాజంలో ఎవరూ ఉండకూడదని ఆకాంక్షిస్తున్నామని కోర్టు తన తీర్పులో వెల్లడిరచింది. కర్ణుడు వంటి పాత్రలు లేని సమాజం మనకు కావాలి అని పేర్కొంది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి తండ్రి పేరును తొలగించాలని కోరుతూ దాఖలైన ఓ రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తల్లిపేరును మాత్రమే పేర్కొంటూ గుర్తింపు పత్రాన్ని జారీచేయాలని అధికారులను ఆదేశించారు.అవివాహిత మహిళల పిల్లు కేవలం ఆమె పిల్లలే కాదనీ, ఈ మహోన్నత భారత దేశం బిడ్డలని..వారు కూడా ఈ దేశ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని సుస్పష్టం చేశారు. వారి గోప్యత, గౌరవం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను హరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *