సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్న బీజేపీ..

కరీంనగర్‌, డిసెంబర్‌ 2
లంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలు చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంతంగానే కొనసాగాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్‌, ఎలాగైనా బీఆర్‌ఎస్‌ ను గద్దె దించాలని కాంగ్రెస్‌, బీజేపీలు కంకణం కట్టుకొని మరీ ఎన్నికల పోరులో తలపడ్డాయి. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలలో ఓటరు తీర్పు భద్రపరచబడి ఉంది. అయితే ఎన్నికల పోలింగ్‌ తర్వాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. మొత్తం 20 ఎగ్జిట్‌ పోల్స్‌ లో 17 ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీదే ఆధిక్యమని తేల్చి చెప్పాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ వస్తాయని చెప్పినప్పటికీ, మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ దూకుడును చూపించిందని తేల్చాయి. ఇదే సమయంలో బిజెపి పరిస్థితి పైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. బిజెపి చేసిన స్వయంకృత అపరాధం వల్లే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ తెలంగాణా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్నట్టు తర్వాత పార్టీ లేదని అంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కి పార్టీ పగ్గాలు అప్పగించిన సమయంలో ఓ రేంజ్‌ లో బిజెపి, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని, కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ను తొలగించడం వల్ల, ఆ స్థానంలో కిషన్‌ రెడ్డికి పట్టం కట్టడం వల్ల తెలంగాణలో బిజెపి దెబ్బతిందని చర్చ జరుగుతుంది. బండి సంజయ్‌ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ శ్రేణుల్లో జోష్‌ ఉండేదని, అలాగే కెసిఆర్‌ ను టార్గెట్‌ చేయడంలో బండి సంజయ్‌ చాలా బాగా సక్సెస్‌ అయ్యే వారని ప్రజలు చర్చిస్తున్నారు. బండి సంజయ్‌ ను మార్చి బిజెపి స్వయంకృత అపరాధం చేసిందని, దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి మూడవ స్థానంలో ఉందని చెబుతున్నారు.
మారిన ద్వారం..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ‘దిక్కు’ల ప్రయోగం నడుస్తోందట. పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఈ ‘దిశా’నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకపోకలకు సంబంధించి వాస్తు రీత్యా ప్రధాన ద్వారాలు మార్చడం ద్వారా పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఆ వాస్తు ప్రణాళికలో భాగంగానే ప్రధాన కార్యాలయంలో పలు మార్పులు జరిగాయని చెప్తున్నారు. అందుకే ఇటీవలే పార్టీ ప్రధాన కార్యాలయంలో తూర్పు ద్వారం నుంచి రాకపోకలు నిలిపేశారట. కొత్త నమ్మకం ప్రకారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తూర్పు ద్వారాన్ని బీజేపీ మూసేసింది. పోలింగ్‌ నుంచి ఫలితాల ప్రకటన వరకు తూర్పు ద్వారం మూసేయాలన్న రాష్ట్ర నేతల ఆదేశాల మేరకు సిబ్బంది దాన్ని క్లోజ్‌ చేశారు. అక్కడ రాకపోకలను ఆపేసి ఉత్తర ద్వారం నుంచే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. ఈ వాస్తు ప్రయోగం సానుకూల ఫలితాన్నిస్తుందని పార్టీ అగ్రనేతలు ఆశిస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే పోలింగ్‌ సరళి అనుకూలంగా ఉందని బీజేపీ అగ్రనేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్నీ కలిసొస్తే ప్రభుత్వ ఏర్పాటులో కమల దళం కీలకంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 35 సీట్ల వరకూ కచ్చితంగా బీజేపీ కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని పలువురు అగ్రనేతలు నమ్మకంగా చెప్తున్నారు. మరి ఆ పార్టీ వాస్తు వ్యూహం ఫలించి, ఉత్తర దిశ కలిసొస్తుందేమో ఎన్నికల ఫలితాల రోజు చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *