36 మందితో టీటీడీపీ జాబితా…

హైదరాబాద్‌, ఆగస్టు 23
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 21వ తేదీన తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడన జాబితాను విడుదల చేశారు. దీంతో తెలంగాణలోని మిగిలిన రాజకీయ పార్టీలు టీ కాంగ్రెస్‌, టీ బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో ఆయా పార్టీ అధినేతలు నిమగ్నమయ్యారు.
అలాంటి వేళ.. తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఎంపికకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ఆగస్ట్‌ 21వ తేదీన చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్‌తోపాటు రావుల చంద్రశేఖరరెడ్డి భేటీ అయ్యారు. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల ఎంపికపై వారు ఈ సందర్భంగా కూలంకుషంగా చర్చిస్తున్నారు. అయితే తొలి విడతగా కొంత మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయాలని.. వారిని సైతం ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతగా 36 మంది అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే మరికొంత మంది అభ్యర్థులతో భేటీ అయి… వారి జాబితాను సైతం మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత వారంత.. దాదాపుగా సైకిల్‌ దిగి.. కారు పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో పసుపు పార్టీ ప్రాభావం కొంత తగ్గింది. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం రెండు సీట్లను మాత్రం గెలుచుకొంది. ఆ తర్వాత వారు సైతం కారు పార్టీలోకి జంప్‌ జిలానీ రాగం ఆలపించడంతో.. తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి నాయకులు లేకపోయినా.. కేడర్‌ మాత్రం కేసీపీ సిమెంట్‌లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి విషయం అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మార్చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌లో తెలంగాణ పదం లేకుండా పోయింది. మరోవైపు 2022, నవంబర్‌లో ఖమ్మంలో టీటీడీపీ శంఖారావం పేరిట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయింది. అంతే తెలంగాణలో పసుపు పార్టీ.. రంగు ఏ మాత్రం వెలిసిపోలేదని తెలుగు రాష్ట్ర ప్రజలకు క్లియర్‌ కట్‌గా అర్థమై పోయింది. అంతే.. ఆ తర్వాత హైదరాబాద్‌ వేదికగా.. టీడీపీ మరో సభ నిర్వహించగా.. ఈ సభకు సైతం భారీగా తెలుగు తమ్ముళ్లు పోటెత్తారు. ఈ ఊపు ఉత్సాహంతో ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టిందీ టీటీడీపీ. అందులోభాగంగా మొత్తం నియోజకవర్గాల్లోని ప్రతీ మారుమూల ప్రాంతానికి ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు తీసుకు వెళ్లాయి. తీసుకు వెళ్తున్నాయి. అందులోభాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు… అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లీ మరి వివరిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో సైతం చైతన్యం విల్లువిరుస్తోంది. అలాగే సైకిల్‌ పార్టీ శ్రేణుల్లో సైతం నయా జోష్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ సారి ఎలాగైనా కేసీఆర్‌ ను గద్దె దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం సైతం పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకు వెళ్తోంది. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటూ… సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ ఆయన సారథ్యంలో దౌడు తీయిస్తున్నారు. అలాంటి వేళ తెలంగాణలో టీడీపీ సైతం.. ఆయా పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి.. సైకిల్‌ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చి.. తన సత్తా చాటేందుకు టీడీపీ శ్రేణులు.. పక్కా వ్యూహాంతో కదం తొక్కుతూ ముందుకు సాగుతోన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *